పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాశ్వాసము

123

గీ. అట్టి నవనీతకవళంబు నెట్టి రెండు, పాళ్ళుగా వారి కొక్కటి పద్మవాస
      కొక్కటియు వేరె నైవేద్యము కలగి వైష్ణ, వంబయన ముగ్ధభార్య కీవలయు మొదట.
క. శ్రీభాగ మైనకబళము, తా భామినికొసఁగ రెండు ధరణి భుజింపన్
      శోభనకరుఁడగు పుత్రుని, సౌభాగ్యము గాంచు సుతయు జనియించు నొగిన్.
మంత్రం. పురుషః పూర్ణకామశ్య హరిర్భద్రం తనోతినః
         యోషిద్వరాపతీ లక్ష్మీర్మంగళం విశతు స్వయం.
గీ. అనుచు నవనీతమును తనయతివ కొసఁగు, నపుడు మంత్రించి సేవింపుమనఁగవలయు
      తరుణియురమున కేలుంచి నరుఁడు వెనుక, మంత్ర మొక్కటి వలయు నీమమున బలుక
గర్భాదానమంత్రం. యస్వంతరాత్మాభూతానా, మనాదినిధనోచ్యుతః
                 నపరఃపరయాభక్త్యాకుక్షిం రక్షంతు తే సదా.
క. అని నాఁటికి నాచార్యా, ది నిజాశ్రితతికిఁ బెక్కు దీనారంబుల్
      తనశక్తికొలఁది దానము, లొనరఁగఁ గావించి నాఁటి కుపవాసముగన్.
క. జాగర మొనర్చి రాతిరి, వేగిర మఱునాఁడు మున్ను విస్రావళికిన్
      బాగుగ నన్నంబిడి కల, శాగతు లక్ష్మీశుఁ గొలిచి యాతరువాతన్.
గీ. పారణ మొనర్పఁ జండాంశుభాగ్విభూతి, నాటి విధినోపమానులైనట్టి సుతుల
      నెత్తుదురు కోరియీకథయంత వినిన, వంధ్యయైనను సత్పుత్రవతి నిజంబు.
క. కలదె చతుర్దశభువనం, బులలోఁ జతుర్దశీ ప్రభువ్రతమునకున్
      దులగా సద్వ్రతమది వై, ద్యులకున్ గలగుండుగలదె యూహింపంగన్.
గీ. మందులేటికి వెదకంగ మందులగుచు, నష్టవిధకుష్టుగుల్మజ్వరాతిసార
      శూలదోషజ్వరాదులు సోకనీదు, తనచరిత్రంబు చెవిసోక వినినఁ జాలు.
గీ. సర్వరోగాదిశాంత్యర్థపూర్వకముగ, మొదట సంకల్ప మొనరించి మునుఁగలేక
      యున్న శుచియైన నుపవాసముండి సూర్య, జపతపంబులు నాఁడెల్ల జలుపవలయు.
ఉ. భానుఁడు గ్రుంకునట్టితఱి భావములో రవినుంచి యింద్రియా
      ధీనుఁడు గాక సర్వమయు దేవశిఖామణి విష్ణుఁ గొల్చుచున్
      మానుట యొప్పు నిద్ర రవిమండల మమ్మురునాఁటి పౌర్ణమిన్
      దా నతిభక్తిఁ జూచి సుకరంబుగ నిత్యజపంబు సేయుచున్.
క. సేవించి యాత్మ తనుర, క్షావరమతి నైదుపళ్ల సద్యోమృత మిం
      పావహకలశమునం గొని, పూవులు బంగరపురత్నములు నిడవలయున్.
గీ. వస్త్రములు మడ్చి సూర్యమావాహయామి, యనుచు కలశంబు ధూపగంధాక్షతోప
      హారముల గొల్చి కట్టినచీర విడచి, నీడఁ జూచుట యొప్పు నన్నేతిలోన.