పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

95

      చంద్రపుష్కరిణీప్రశస్తభూరిఫలాయ శోభనారామసంశోభితాయ
      ప్రతిదినోత్సవ శుభప్రదదర్శనాంగాయ హరముఖాద్యమరసమర్చితాయ
      భక్తసులభాయ లోకైకపావనాయ, మంత్రరూపాయ సింధుజామందిరాయ
      రంగనాయక సజ్జనరక్షకాయ, దేవరాజాయ తే నమస్తే నమోస్తు.
గీ. రంగనాయక కావేరిరంగ చెలువ, రంగ కస్తూరిరంగ భుజంగశయన
      రంగవైభోగ రంగ శ్రీరంగ యనుచుఁ, జూచి మెచ్చుల మునిఁగి యారాచమేటి.
సీ. శ్రీకరంబును బ్రణవాకార మైనట్టి రంగధామునకు శ్రీమంగళంబు
      మహియెల్ల నొకఫణామణి దాల్చు శయ్యాభుజంగమస్వామికి మంగళంబు
      తమ్ములేలని మీపదమ్ములు చేఁదాల్చు మంగళాకారుకు మంగళంబు
      భుజమధ్యమున మిమ్ముఁబూని చరించు విహంగవల్లభునకు మంగళంబు
      సజలజలధర కోమల శ్యామలాంగ, రంగదాకారునకు మీకు మంగళంబు
      హారిభవదీయ కరుణాకటాక్షములకు, మంగళము మంగళము నిత్యమంగళంబు.
గీ. అనుచు వినుతించు రాజుపైఁ గనికరంబు, చాలఁ గనిపింప శ్రీరంగశాయి యపుడ
      ధాతమొదలు విభీషణాంతంబుఁ గాఁగఁ, గలుగు తనరాక తెలివిడిగాఁగఁ బలికె.
క. వింటివి మత్కథఁ గన్నులఁ, గంటివి నామూర్తి దీనిఁ గడచిన భాగ్యం
      బొంటి మరిగలదె ధన్యత, మంటివి సుఖముండు మనుచు మరి యురకున్నన్.
క. ఆధాత్రీపతి రంగా, రాధాబహుమానవిధుల రంజిలి వెడలెన్
      శ్రీధామ మతనితో సం, బోధించెఁ బురోహితుం డపు డమితసూక్తిన్.
ఉ. చూచితివే నృపాలక విశుద్ధము సత్య మనంతశక్తి యు
      ష్మాచరితంబు రంగమహిమాహ్వయ దివ్యవిమాన మిందుపై
      గోచరమైన శృంగము లగున్ నిగమావళియే తదాకృతిన్
      లోచనపద్మమూర్తి బొదలుం బ్రణవం బజహర్విభూతితోన్.
సీ. శయనాసనాంశుక ఛత్రోపధానపాదుకల యుద్భవమని తోయజాక్షు
      సేవించుకతమున శేషి శేషత్వసమ్మద మీశ్వరునకును ఫణిపతికిని
      కలుగుట శేషాఖ్యఁ గాంచనియనఘుండు వీర్యతేజోబలైశ్వర్యశక్తి
      విజ్ఞానముల పేర విలసిల్లు షడ్గుణైశ్వర్యంబులని నివి చాల యునికి
      నయ్యెభగవంతుఁడని నీదృశాత్మగుణము, లందుఁ బరిపూర్ణుడగుట ననంతుఁడయ్యె
      గాన హరి కార్యభార మొక్కరుఁడె పూని, తలకు నెత్తుకుయున్నాఁడు తలకులేక.
గీ. అట్టివిశ్వంభరుని శేషు నాత్మలోన, దలఁచి తాదృశగుణధ్యానపరత నున్న
      వారలకు నెల్ల నిహపరవాససుఖము, లాత్మవలదన్న బోవక యనుసరించు.