పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

‘శుభస్య శీఘ్రంబు’ అన్నవిధంబున నిక్కార్యంబునకుఁ దావసంబు సేయక విచ్చేయవలయునని సూచన యొనర్చి నచ్చిన ప్రేమ నిలిచిన నృపపుంగవునకు హృదయంగమంబుగా సమంచితసుభాషితంబుల, మంచిది, మిగులసంతోష మాయెనని రామేయామేయసౌందర్యుండగు గోవిందుండు గజారూఢుఁడై, ముంగల నూదుట, మీఁటుల వ్రేయుట, కీయుట, కంచుపైకం, బాలాపంబులను పంచమహావాద్యంబులతో ననుకరించి భూరిభేరీభాంకారంబులు భోరుకలంగ, సకలబిరుదధ్వజంబులు జెలంగ, వందిమాగధకైవారంబు లుప్పతిలంగఁ, దత్పురజనులు సేసలు జల్లంగఁ, జందనాగరుగురుసాంబ్రాణిధూపము లిరుగడలఁ బ్రబలంగఁ, దొలంగఁ ద్రోయరాని తన నలువగునలువగల జలగంబులతోఁ గదలివచ్చునప్పు డప్పుడమిఱేఁ డీరేడులోకములు కడుపునఁ గడపు నేరేడుబండుతీరు మేనున జొక్కపుఁజక్కెరమొక్కుఱెక్కపక్కెరపక్కి నొక్కు చక్కనిమొక్కలిఁ గన్న వెన్నునిఁ గూర్చి మున్నుగాఁ దత్పద్మసరోవరంబుమహిమఁ దేటపడ విన్నపంబు సేయంగడంగె, మాతపితృగురుదేవవేదబ్రాహ్మణనిందకులును, దేవతాబ్రాహ్మణద్రవ్యాపహారకులును, మధుపానోన్మత్తమత్తకాశినీమధురాధరపానం బొనర్చు దుష్కాములును, గోబ్రాహ్మణబాలకస్త్రీహింసకులును, సాధుశీలయు యౌవనయు నైన కులసతినిం బాసి కేళినిదారోదారవ్యాపారంబున నపారంబుగా వారాంగనాసంగమం బపేక్షించువారును, లజ్జ యుజ్జగించి మగని కనుమొఱఁగి పెఱమగనిఁ దగులు మగువలును, బాలకులసొమ్ము లొడుచువారును, దేవాలయమఠప్రాకారతటాకవనఘాతకులును, అన్నవిక్రయులును, దుర్దానప్రతిగ్రాహకులును, యెఱుఁగని ప్రాయశ్చిత్తవిధు లేర్పరచువారును, కొండీఁడును, కొండియంబు వినునతండును, గరదుండును, గృహదాహకుండును, తనజీవనంబుకై పరులకార్యంబుఁ జెఱచునతండును, ఘనులయందు గుణంబులు మాని యీషద్దోషంబులు బ్రకటనంబు సేయువారును, పైతృకంబు విడిచిన యతండును, నమ్మి గొలిచినవారిఁ గికురించి గ్రాసంబు లివ్వక వెలయు దుష్ప్రభుండును, స్వామిద్రోహియును, విశ్వాసఘాతుకుండును, వంచకుండు, లక్షణలక్ష్యరాహిత్యకవితానిబంధనధవులగు కుకవులును నేదొకనిమిత్తంబున నీపద్మసరోవరంబున నిలవరంబున నొక్కపరి తానం బొనరించినఁ