పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68 రాధికాసాంత్వనము

సీ. మును చల్వ లొసఁగుచు మోమోటమున నున్న
సోముఁడు సోముఁడై చురుకు చూపె
నపరశరీరుఁ డై యాత్మజుఁ డై యున్న
మారుఁడే మారుఁ డై పోర సాగె
దాక్షిణ్యశాలి యై తగుప్రాణ మై యున్న
గాలియే గాలి యై కలఁప సోఁకె
మధువు గూరుచువేళ మహిమ నపేక్షించు
సురభియే సురభి యై తరుమఁ జూచె
తే. నగ్నిశిఖ లయ్యె వివరింప నగ్ని శిఖలు
భువి శిలీముఖములు శిలీముఖము లయ్యె
నన్ని యట్లయ్యె నిట్లైన యపుడె యిపుడు
కృష్ణ దేవునిదయ దప్పె నేమి సేతు. 117

వ. ఇ ట్లగుటంజేసి. 118

సీ. తగుకుంకుమరసంబు మగనిపేరురమునఁ
బెం పొందుకొమ్మ కర్పించరమ్మ
పద నై నగంబురా సదయువాతెర నాని
యెసఁగురంభోరున కొసఁగరమ్మ
నూఱినకస్తూరి గారాబుపతిప్రక్క
వెలయుమృగాక్షి కిప్పించరమ్మ
చేర్చి కూర్చినవిరుల్ చెలికానిఁ బైకొని
పొసఁగులతాతన్వి కొసఁగరమ్మ
తే. కటకటా నేర కిటు లంటిఁ గాని ద్రోహి
యైన నేఁ గూడఁగాఁ బెట్టినట్టిదీని
నిచ్చినంతనె వారల మచ్చికలకు
హాని పుట్టదె యిప్పుడే చానలార. 119

వ. అని యనేకవిధంబుల విలపించుసమయంబున. 120