పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 67

వానివగ లెంచి మై నీరు గానియపుడె
రాతఁ జేసెనొ చెనటివిధాత నన్ను. 114

సీ. వానికన్నులతేట వానిచల్లనిమాట
వాఁ డాడుసయ్యాట వానిపాట
వానిముద్దుమొగంబు వానికంబుగళంబు
వానిఱొమ్ముదిటంబు వానిడంబు
వానివాతెరకావి వానిపెన్నెరితావి
వానిచక్కనిఠీవి వానియీవి
వానిమూఁపులపొంగు వానిమేనిమెఱుంగు
వానికౌనుబెడంగు వానిరంగు
తే. వానియొరతీరుచూపులు వానిసౌరు
వానివలపులదొరసాము వానిగోము
వానిసేఁతలతగుమేల్మి వానితాల్మి
పరుల కెవ్వరికిని లేదు మరపు రాదు. 115

సీ. తనరఁ జూచిన దృష్టి దాఁకునో యని వాని
నునుమోము కనులారఁ గనఁగ నైతిఁ
గదియ నొక్కిన నేడఁ గందునో యని వాని
యధరంబు తనివార నాన నైతి
బిగిగుబ్బ లెద సోఁక బొగులునో యని వాని
ఱొమ్మున నిండారఁ గ్రుమ్మ నై తిఁ
దడవు చేసిన మేను బడలునో యని వాని
జెలఁగి నామనసారఁ గలియ నైతి
తే. నొచ్చు నంచని చెక్కిలి నొక్కనై తి
నలుగు నని గ్రుచ్చి కౌఁగిట నలమ నైతి
నందసుతు ప్రేమ సతత మని నమ్మియుంటి
నిప్పు డీరీతి నడుచు నంచెఱుఁగ నైతి. 116