పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 41

మ. యమునాతీరవిహార హారసదృశోద్యత్కీర్తిసంభార భా
రమణీయాకృతిమార మారసికతాప్రావీణ్యసంసార సా
రమరందోక్తివిచార చారణనుతప్రఖ్యాతవిస్తార తా
రమహీభృత్సమధీర ధీరమునివాళారాధార రాధారతా. 152

క. ధీరాభిమతోద్దారా
ధారావర కృత్తమత్త దానవవారా
వారాశినిభగభీరా
భీరాహిత్యామరాద్రివిశ్రుత ధీరా. 153

మాలిని. కలికలుషవిఫాలా కాంచనోద్భాసిచేలా
గళధృతవనమాలా కాంతరాధావిలోలా
బలభదుపలనీలా పాండవత్రాణశీలా
తిలకితగుణజాలా దేవకీదేవిబాలా. 154

గద్యము. ఇది శ్రీచిన్నికృష్ణకరుణాకటాక్షవీక్షణక్షణప్రవర్ధమానానూన
శృంగారరసప్రధాన సంగీత సాహిత్యభరతశాస్త్రాదివిద్యాపారంగత
శ్రీమత్తిరుమలతాతయాచార్య పాదారవిందమిళిందాయ
మానమానసచోళసింహాసనాధ్యక్షప్రతాపసింహ
మహారాజ బహూకృతానేకచామీకరాం
బరాభరణ ముత్యాలుగర్భశుక్తిముక్తా
యమాన ముద్దుపళని ప్రణీతంబైన
రాధికాసాంత్వనం బనుశృంగార
ప్రబంధంబునందుఁ బ్రథమా
శ్వాసము.