ఈ పుట అచ్చుదిద్దబడ్డది
(ఇళాదేవీయ మనునామాంతరముగల)
రాధికాసాంత్వనము
ద్వితీయాశ్వాసము
శ్రీ రాధామధురాధర
సారామృతపానచతుర సద్గుణహారా
పారావార విహారా
భారతసఖ చిన్నికృష్ణ పాలితకృష్ణా. 1
తే. అవధరింపుము దేవదివ్యానుభావ
వ్యాసమునిసూతి జనకభూవిభునిఁ జూచి
చొక్కటపుజీనిచక్కెరయుక్కెరలకు
నెక్కుడై మించు నుడిచవులెక్కఁ బలికె. 2
క. అటు లారాధిక గోపీ
విటు నటు రతికేళి నేలి విడువంగ నిలా
కుటిలాలకఁ జేరి తనదు
కుటిలత్వ మెఱుంగనీక కూరిమి చెలఁగన్. 3