పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెల్లింప నేర్తువు చెప్పినరీతిగాఁ
గని ద్రౌపదీసతి కాన కేగ
నటియింప నేర్తువు నవరసంబుల నంటి
తగురంభ యనిమిషత్వము వహింప
తే. నీదె మఱి యుక్తి పరికింప నీదె శక్తి
నీదె నెరపద్దు సరయఁగా నీదె ముద్దు
సరసముగఁ జేసి రాధికాసాంత్వనమ్ము
భక్తి హరి కిమ్ము శ్రీముద్దుపళనిబోటి. 36

వ. అని నియోగించిన నేనును బ్రబంధనిబంధనోద్యుక్త నై. 37

షష్ఠ్యంతములు


క. శ్రీకృష్ణదేవునకుఁ గరు
ణాకరచారిత్రవిలసదనుభావునకున్
గోకులజప్రియభావున
కాకృతిజితశంబరార్యహంభావునకున్. 38

క. కౌస్తుభయుతవిస్తృతవ
క్షస్తలునకు భక్తలోకసంరక్షణతా
నిస్తులునకు శ్రుతిమస్తక
వాస్తునకు సమస్తవిబుధపరవస్తునకున్. 39

క. శౌరికి జనవాంఛితసహ
కారికిఁ బాండవకులోపకారికి నచలో
ద్ధారికిఁ గలికలుషౌఘవి
దారికి దనుజేంద్రమదమతంగజహరికిన్. 40

క. అర్జునమదనాభ్యాసున
కర్జునకరకాంతిమందహాసున కతిభ
క్తార్జునకృతసహవాసున
కర్జునవాసునకు ద్వారకావాసునకున్. 41