పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 113

బంగారుగిండ్లకుఁ బడతిపాలిండ్లకు
నేయనుబంధమో యెఱుఁగ రాదు
తే. కళుకుమగమీలు చెలివాలుఁగనులడాలు
కాంతిజిగిచూపు మరుచేతికలువతూపు
వనితమైమించు తళతళ యనెడిమించు
నొక్కచోటనె పుట్టని దొకటె కొదవ. 148

ఉ. గంబుర మోవి మారుతురగంబుర తియ్యనిపల్కు నీలనా
గంబుర వేణి చందురుసగంబుర ఫాలతలంబు చారుపూ
గంబుర కంఠ మంబుజయుగంబుర కన్నులు దేవమత్తనా
గంబుర నెన్నడ ల్సురనంగంబుర గుబ్బచనుల్ దలంపఁగన్. 149

క. తారలు చక్కనిగోరులు
తారలు రదపఙ్క్తి పంచదారలు పలుకుల్
తారలు చొక్కపుపిక్కలు
తారలఁ జెలి గెలుచు టరుదె తారుణ్యమునన్. 150

ఆ. మబ్బుమబ్బు నడచు బిబ్బోకవతి వేణి
వింటివింటి నడచు వెలఁది నడుము
కలువ గెలువఁ జూచుఁ గలకంఠి మైతావి
మించు మించ నెంచు మెలఁత మేను. 151

తే. తొడలె చాలును రంభలఁ దొడరి గెలువ
నుదురె చాలును శశిరేఖ నెదురుకొనఁగ
గోరె చాలును దారల దూఱుసేయఁ
జాన మెయి చాలు హేమాతిశయము నెంచ. 152

తే. ఇందుబింబాస్యచిఱునవ్వు నెంచి చూడఁ
జంద్రకిరణవిలాసంబు సహజ మయ్యె
నింతినునుగొప్పుకప్పున కెంచి చూడఁ
గాలమేఘంబు సరిసాటి గా దనంగ. 153