పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

మన్నారుదాసవిలాసము


విప్పుగ నెలపొడువునఁ దా
నప్పతిఁ గూడంగ గంగ యట వచ్చె ననన్.

86


వారస్త్రీవర్ణన

చ.

మనసిజధన్వి జీర్ణకుసుమస్వశరాసనబాణముల్ రయం
బునఁ బడవైచి, యన్నగరిప్రోడమిటారుల తీరు [1]మీరు నా
కనుబొమవిండ్లుఁ జూపులను గట్టి లకోరులు బట్టి లోకముల్
మునుకొనిఁ గెల్చి యెంతయును మోదముతో విలసిల్లు నచ్చటన్.

87


చ.

అల పురిలోపలం బరఁగు నంబురుహాక్షుల యొప్పుమీరు నా
గళముల నాభిజంఘలను గన్బొమలన్ మెరుఁగారు నారులన్
గెలువఁ దలంచి శౌరికిని నిత్యము సేవ నొనర్పుచున్న దౌ
[2]జలజము చక్రమున్ గదయు శార్ఙ్గము నందకముం దలంపఁగన్.

88


ఉ.

ఈ పదునాల్గులోకముల నెన్నిక కెక్క జయింపఁజాలు బా
హాపటిమాఢ్యుఁ డౌ మరున కా శరపంచక మంచు నెంచి తా
నేపున లోకకర్త సృజియించిన బాణకదంబకం బనా
నాపురి వారకాంతల కటాక్షపరంపర నింపు నింపులన్.

89


ఉ.

కన్నులు గండుమీలు తొలుకారుమెఱుంగులు మేను లెయ్యెడం
గన్నవి గావు కౌను లలకంబులు చొక్కపు టింద్రనీలమున్
చన్నులు కుంభికుంభములు [3]సారసముల్ పదముల్ దలంపఁగా
నన్నగరంబు కామినుల కన్యవధూటులు సాటి వత్తురే.

90


చ.

అగణితధాన్యరాసులను నద్రిశతంబుల రత్నకోటులన్
నెగడెడు రాజవీథులను నీరధులం గనుపట్టు దట్టమౌ
పగడపుతీవచా లనఁగ భాసిలు నెప్పుడు నప్పురంబునన్
మిగులఁ జెలంగు వారతరుణీపదయావకరాగచిహ్నముల్.

91


చ.

చవిఁ గనినారుగా యమృతసారము [4]నిర్జరులార! మీర లా
దివి నికఁ జూడుఁ డీయెడ మదీయనవామృత మంచు నెత్తు న
య్యవనికరాగ్రసీమ దగునట్టి ఘనామృతకుంభరాజినా
నవిరళనారికేళనివహంబుల బొండ్లము లొప్పు నప్పురిన్.

92
  1. మీర
  2. జలము
  3. సారసములౌ పదముల్
  4. నిర్ఝరులార