పుట:భీమేశ్వరపురాణము.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 77


ధరాంధకమహిషాసురబిడాలాక్షధూమ్రాక్షగంధసింధురాసురవిద్యున్మాలితారకబలిబాణపౌలోమనివాతకవచకాలకేయాదు లగురాక్షసులును బాకశాసనపావకపరేతరాజపలలాశిప్రాచేతపవననపౌలస్త్యపశుపతిప్రధాను లగువేల్పులునుం దమలోన దాయాదసంబంధంబునం బొడమినవైరానుబంధంబునం బరస్పరవిజిగీషులై రోషంబున నెదురువేలంబులు పెట్టి కట్టుపకాసులై ప్రతిఘటించి బెట్టయి నెట్టుకొని యున్న సమయంబున.

47


సీ.

దివ్యాయుధము లైదు ధృతిచేతనంబులై, శత్రుసంహారంబు సంస్తుతింపఁ
బులుఁగుఱేఁడు కరాబ్జములు రెండు మొగిడించి, భ్రూలతాదేశంబు పొలుపునరయ
సౌఖశాయనికులై సనకాదియోగీంద్రు, లనురాగవీక్షణం బభిలషింప
నూరురంభాస్తంభయుగళంబుపైనుంచి, లక్ష్మి శ్రీపాదపల్లవము లొత్తఁ


తే.

బన్నగాధీశభోగతల్పంబుమీఁదఁ, దత్ఫణారత్నదీప్తి మై తళుకుఁ జూపఁ
బాలమున్నీటిలో నిద్ర మేలుకొన్న, హరికిఁ బొరిచూప నేతెంచె హరిహయుండు.

48


వ.

ఇట్లు చనుదెంచి.

49


తే.

ఒంటి నేతెంచి మంతనంబుండి నిలిచి, చక్రధరుతోడ హితకార్యచర్చ చేసి
యేగె దేవేంద్రుఁ డిరుచెవి నెఱుఁగకుండ, సిద్ధసంకల్పుఁడై యాత్మశిబిరమునకు.

50


వ.

తదనంతరం బాశ్రీమన్నారాయణుండును.

51


క.

ఓవెఱ్ఱులార యేటికి, నీవెడఁగు విచారములు సహింపఁగ రాదా
యేవారి కైన మేలా, చావు లతర్కితము లుగ్రసంగ్రామములన్.

52


తే.

కుడిచి కూర్చుండి మీ రేల కొఱఁతయైన, కుమ్ములాడెద రో యన్నదమ్ములార
గొఱ్ఱె క్రొవ్వియు సెలగట్టెఁ గొఱికినట్లు, కటకటా మీవివేకంబు గాడుపడఁగ.

53


ఉ.

భద్రము మీకుఁ గావలె నపారముగా సురదైత్యులార
విత్రవ ముజ్జగింపుఁడు వివేకము పాకము దప్పకుండఁగా
భద్రసువర్ణపీఠికలపైఁ గొలువుండి త్రిలోకరాజ్య మ
చ్ఛిద్రముగాఁగ నేలుట విశేషమొ చచ్చుట తా విశేషమో.

54


వ.

అది గావున సుధాపానంబున జరామరణంబు లుజ్జగించి సుఖం బనుభవింపుఁడు క్షీరసముద్రమథనంబునం గాని సుధారసంబు సంభవింపదు గావున.

55


శా.

క్షీరాంభోధి మథింపఁ గావలయు నక్షీణప్రతాపప్రభా
వారంభంబున నాదికచ్ఛపము మూలాధారకుండంబుగా
సారోదారము మందరాచలము చంచన్మంథదండంబుగా
గారామార రసాతలాధిపతి దృక్కర్ణుండు సూత్రంబుగన్.

56