పుట:భీమేశ్వరపురాణము.pdf/96

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76 శ్రీ భీమేశ్వరపురాణము


కటకరక్షకుఁ డైన కాలభైరవునకుఁ, బ్రకటపాతాళభైరవుఁడుసాటి
విశ్వాధిపతియైన విశ్వనాయకునకు, భీమనాథేశ్వరస్వామిసాటి


తే.

మోక్షవిభవంబునకు సాటి మోక్షలక్ష్మి
భోగమహిముంబునకు సాటి భోగమహిమ
వారణాశికి శ్రీదక్షవాటమునకు
దారతమ్యంబుఁ జర్చింప ధర్మ మగునె.

40


తే.

తరమె వర్ణింప సప్తగోదావరంబు
సలిలకల్లోలశిఖరహస్తంబు లెత్తి
పాతకంబుల జంకించు బహువిధముల
ఘుమఘుమారంభహుంకారఘోష మెసఁగ.

41


వ.

అని కుంభసంభవుండు చెప్పిన విని యమ్మహాత్ము వీడ్కొని నగరప్రదక్షిణపూర్వకంబుగా భీమేశ్వరు దర్శించి కృతార్థులై యొక్కరమ్యస్థలంబున నమ్మహామునులు గూర్చుండిరి యనంతరంబ.

42


ఉ.

ఆమునిమండలంబునకు నంజలి బంధముతోఁ బ్రదక్షిణ
గ్రామనమస్కృతుల్ గడపి గారవమారఁగ మంకణుండు ఋ
క్సామయజుర్విశారదుఁడు శైవపురాణకథారహస్యగో
ష్ఠీముదితాంతరంగుఁడు ప్రసిద్ధుఁడు భక్తి దలిర్ప ని ట్లనున్.

43


సీ.

పరమపుణ్యుఁడ నైతి భాగ్యవంతుఁడ నైతి, ధన్యుండ నైతి నాతపసు పండెఁ
దీర్ఘంబులన్నియుఁ దిరిగి చూడఁగఁజాల, నొక్కజన్మమున నీయుర్విలోన
దిగ్దేశముల సర్వతీర్ణంబులను నాడి, తీర్థభూతత్వప్రతిష్ఠఁ గన్న
మిమ్మందఱను గంటి మీకృపాబలమున, నేను దీర్థమ నైతి నింతనిజము


తే.

భీమనాథమాహాత్మ్యంబు పెంపువినఁగ, వేడ్క యగుచుండు నాకు నీవేళయందుఁ
బ్రార్థనము చేసి వేఁడెద భవ్యులార, యానతీఁదగు నాకు మీలోన నొకఁడు.

44


వ.

అనిన విని యందఱు వసిష్ఠమహామునిం బ్రార్థించిన సకలమునిజనానుమతంబునఁ గుంభసంభవుని నియోగంబున నప్పుడు మైత్రావరుణుండు మంకణున కిట్లనియె.

45


క.

భీమ మగుగరళకూటము, భూమియు గగనమును దిశలఁ బొడచూపినచో
భీమగతి మ్రింగెఁ గావున, భీమేశ్వరుఁ డయ్యె నితఁడు బిరుదాంకమునన్.

46


క్షీరసాగర మథనకము ప్రారంభము


వ.

అనిన విని మంకణుండు పంకజాసనసంభవునితో మునీంద్రా దక్షవాటికాధీశ్వరుండు కాలకూటంబు నెబ్భంగి నుపసంహరించె నక్కథాక్రమంబు పరిపాటిందేటపడ నా కెఱింగింపవే యనుటయు నతం డిట్లని చెప్పం దొణంగెఁ దొల్లి జలం