పుట:భీమేశ్వరపురాణము.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44 శ్రీ భీమేశ్వరపురాణము

సీ. నిండి పాఱుచు నుండు నే నిదాఘములందుఁ, దళుకొత్తు సప్తగోదావరంబు?
షట్కాలశంభుపూజావిధానములకు, బల్లవప్రసవదర్భలును గలవె?
కాంతాజనంబులు కమియాన నిడుదురే, పురములోఁ దత్కాలపుణ్యభిక్ష?
ఘనతపంబునకు విఘ్నంబు సేయరుగదా, యమరేంద్రుఁ డొసఁగిన యప్సరసలు?
తే. కాలభైరవవిఘ్నేశకార్తికేయ, వీరభద్రాదిపరివారవీరగణము
స్వాగతము సేయునే కార్యసాధకులకు, దక్షవాటికయందు వాతాపిదమన? 7

ఉ. ముక్కు మొగంబు చూడ కొకమోసపుమాటకు విశ్వనాయకుం
డెక్కడికైనఁ బొమ్మనుచు నెఱ్ఱనిచూపులఁ జూచె నల్కతో
ధిక్కరణంబు సేయఁ జనుదంచితిఁ గాశిని నుండి నాకుఁ దా
దిక్కయి భీమనాకుఁడు దీర్చునొకో యవమానదుఃఖముల్. 8

తే. నన్నుఁ గన్నతల్లి యన్నపూర్ణామహా, దేవి విశ్వనాథదేవు తరుణి
గుఱుతు చెప్పి తన్నుఁ గొలువంగఁ బుత్తేర, వచ్చినాఁడ నేలవలదె తనకు? 9

సీ. భీమేశ్వరేశ్వర శ్రీమహాదేవుండు, కరుణించునే నన్ను బరమశైవ?
సప్తగోదావరోత్సంగధాముఁడు నన్ను, నాదరించునె యిల్వలాసురారి?
సప్తపాతాళవిష్కంభమూలస్తంభ, మూరిడించునె నన్ను నుపరతాత్మ?
దక్షిణాంభోరాశితటమేదినీభర్త, రక్షించునే నన్ను • బ్రహ్మవాది?
తే. స్వాగతము సేయునే నాకుఁ జంద్రమౌళి, కాంక్షితంబిచ్చునె నాకుఁ గాళగళుఁడు?
కాశీలోఁ బడ్డ మానభంగంబు వాయఁ, గుస్తరించునె నను శూలి కుంభజన్మ? 10

ఉ. దోసము పెద్ద లేదనక ధూర్జటి నిష్ఠురకంఠహుంక్రియా
భ్యాసముమై నదల్చి యదయస్థితిఁ గాశి వెలార్చె నింక నే
నా సరిసంయమీంద్రుల ననాథత నేమెయిఁ జూతు దక్షవా
టీసదనుండు ప్రేమ ఘటియింపక తాను నుపేక్ష చేసినన్. 11

కలశభవుఁడు పారాశర్యునకు దక్షారామమహిమంబు చెప్పుట

వ. అనినఁ బారాశర్యునకు నత్తపోధనవర్యుం డిట్లనియె. 12

మ.వితతాష్టాదశసంహితాగమకథావీథీసహస్రంబు భా
రతతంత్రం బఖిలంబు నీయది యపారంబైన యౌమ్నాయసం
తతి నీచే వివరింపఁగాఁబడియె విద్యావర్ధనా నీవు నీ
క్షితిలోఁ గానని క్షేత్రముల్ గలవె? యీచింతాభరం బేటికిన్. 13

వ. భీమలింగంబు మాహాత్మ్యంబు నీ వెఱుంగనియదియునుంగలదె? దక్షారామపుణ్యక్షేత్రం బఖిలపురాణప్రసిద్ధంబు కాదే? నీమనోవిషాదంబునం జేసి యెఱుఁగనివాఁడవుంబలె నడిగెదవుగాక, యైన నడిగిన యర్థంబు చెప్పెద నాకర్ణింపుము. 14