Jump to content

పుట:భీమేశ్వరపురాణము.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 45

ఉ. మోక్షస్థానము భోగభూమియును నై మున్నూఱుక్షేత్రంబులన్
సాక్షాద్బ్రహ్మపదం బనంగ నపరస్వర్గంబునా నొప్పగున్
దక్షారామము భీమనాయకమహాధామంబు లోకత్రయీ
చక్షుః ప్రాహుణకాయమానసుషమాసంపత్సముద్దామమై. 15

తే. రాజవంశజుఁడగు భగీరథునివెనుకఁ, బాఱుతెంచిన చదలేఱు పాటియగునె
సప్తమునిరాట్ప్రతాపసంప్రాప్తమైన, సప్తగోదావరంబుతో సారమహిమ. 16

సీ. దక్షప్రజాధినాథమహాధ్వరక్రియా, దీక్షాధిగమపుణ్యదేశమునకు
బ్రహ్మవిష్ణుపురందరప్రధానసుపర్వ, పరమసంయమిసభాభవనమునకు
దాక్షాయణీయోగదహనార్చిరున్మేష, సామిధేనీమంత్రజాతమునకు
వీరభద్రభుజావిహారహేలాసమా, రంభనాటకనాట్యరంగమునకు
తే. నమృతమయదివ్యతేజస్స్వయంభులింగ, శాంతభీమేశ్వరేశ్వరస్థానమునకు
దక్షవాటంబునకు మోక్షధామమునకు, భోగజన్మస్థలమున కేపురము సరియె? 17

వ. వెండియుఁ చండభానుకృతప్రతిష్ఠుండును, నాఖండలముఖనిఖిలబర్హిర్ముఖశిఖామణిమయూఖకిమ్మీరితచరణారవిందుండును, సప్తపాతాళభువననిష్కంభనిర్భేదసమాసాదితావిర్భావుండును, దివ్యామృతస్వయంభూరుజ్జ్యోతిర్లింగమయమూర్తిధరుండునైన, భీమేశ్వరుండు భోగమోక్షప్రధానదీక్షాధురంధరుండై యందు వసించియుండు నమ్మహాదేవుచేత నప్పుణ్యక్షేత్రం భీమమండలంబనఁ బండ్రెండు యోజనంబులమేర కైవల్యకల్యాణమండపంబును భోగలక్ష్మీవిలాసభవనపుండరీకంబునునై కుండలాముఖసంవేద్యశార్దూలక్షేత్రంబులు మొదలుగాఁ గల శాఖోపశాఖాక్షేత్రంబులం గలిగి దక్షిణజలధివేలావనోపకంఠంబున వేదండవదనశుండాకాండచుళికితోన్ముక్తసప్తగోదావరసలిలధారాఝణత్కారబృంహితబ్రహ్మాండగోళంబును, దుల్యభాగాప్రవాహలహరికాఘోషఘుమఘుమాయమానదిగ్విభాగంబును, నేలానదీమాతృకాయమానకేదారక్షేత్రసంవర్ధితానేకవ్రీహిభేదసంపత్సంపన్నంబును, ఫలభరితనారికేళషండమండితప్రౌఢపీఠాపురోపకంఠసీమాబహిర్భాగంబును, మాతృకాయమానగోదావరీక్షేత్రపుణ్యాగ్రహారపరంపరాభూనిలింపసంపత్సంపాదితాధ్వరక్రియాసమాహూతాదిదేవతాకదంబసంబాధసంచరితంబును, గౌంతేయవాహినీప్రాంతసంతప్యమానమునిమండలంబును సహకారకాంతారఫలరసాస్వాదమోదమానపుంస్కోకిలకుటుంబకంఠనాళకోమలకుహూకారకోలాహలప్రపంచితపంచముంబును, హరివంశంబునుంబోలె బలభద్రప్రద్యుమ్నానిరుధ్ధపురుషోత్తమాధిష్టితంబును నై, మహాక్షేత్రంబన, మహాలింగస్థానంబన, దక్షిణకాశియనఁ, గళ్యాణనిలయంబనఁ, గైలాసప్రతిబింబంబన,