పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రస్తావన

ఆంధ్రవాఙ్మయమునందు బసవపురాణము సుప్రసిద్ధమైన ప్రాచీన కావ్యము. బసవపురాణము జానుఁదెనుఁగు కావ్యములందు రసవత్కావ్యమై, లింగధారులకు పవిత్రమైన పురాణముగ నున్నది. బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారు వ్రాసిన విపులమైన పీఠిక బసవపురాణప్రతిభ నాంధ్రలోకమునకు విశదము చేయుచున్నది. పీఠికయందు సోమనాధునికాలము, కృతులు, శైవమత భేదములు, బసవేశ్వరునిచరిత్రము, భక్తులచరిత్రములు మొదలగు విషయములను ప్రభాకరశాస్త్రిగారు సువ్యక్తముచేసిరి. విషయవిమర్శనము నందువలె రచనావిమర్శనమునందను ప్రభాకరశాస్త్రిగారి వైదుష్యము సువ్యక్తమగుచున్నది. సోమనాథుని కవితాసామర్థ్యమును దేశిరచన, ద్విపద, శివకవులు, జానుఁదెనుఁగు, శబ్దప్రయోగములు, శబ్దవిశేషములు, రచనా సౌందర్యము మొదలగు శీర్షికలందుఁ బరిష్కర్తలైన శాస్త్రిగారు బాగుగ విమర్శించి పాఠకులకు గ్రంథమునం దభిరుచిని విస్తరింపఁజేసిరి. బసవభక్తి రసము, తెనుఁగుతియ్యఁదనము, ద్విపదగతి బసవపురాణమునందు రసస్థాయిని బొంది భక్తి పారవశ్యమును, బ్రహ్మానందమును గలుగఁజేయుచున్నవి. సోమనాథుఁడు తనరచనకుఁ బురాణనామకరణము చేసిననను బసవపురాణము కావ్యరూపమును దాల్చినది. ఆంధ్రవాఙ్మయ పరిశోధనలకు బసవపురాణము పెన్నిధిగా నున్నవిధమును ప్రభాకరశాస్త్రిగారి పీఠికయును, మూలమును సువ్యక్తము చేయుచున్నది. గ్రంథమునకుఁ గీలకమైన వీరశైవమతవిషయమై పరిశోధనలు చేయవలసిన యవసరమును వర్తమానకాలమునందు వీరశైవమునకుఁ బట్టిన దుస్థితి తెలియఁజేయుచున్నది. వీరశైవమునకును, వైదికమతములకును గల సంబంధబాంధవ్యములను బరిశోధకులు విమర్శించి వివిధ మతములకును గల సమానధర్మములను నిరూపించుట శ్రేయస్కరము.

వైదికమతము

వేదయుగమునందుఁ గర్మపరమైన వైదికమతము కాలక్రమమున జ్ఞానపరమై పరివర్తనమును బొందినది. మతలక్ష్యమనిత్యములైన యజ్ఞయాగాదుల