పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ii

ఫలములనుండి నిత్యమైన మోక్షమునకు మరలినది. కర్మకాండకును, జ్ఞానకాండకును సంఘర్షణము గలిగినది. వేదములందలి మంత్రములకును, బ్రాహ్మణములకును సమన్వయములేక కర్మలు పరిహాసపాత్రములైనవి. జ్ఞానప్రధానములైన జైనబౌద్ధాది మతములు ప్రబలినవి. కర్మదీక్షాపరాయణులైన బ్రాహ్మణులకును, బ్రాహ్మణేతరవర్ణస్థులకును వైదికమతలక్ష్యమునందు భేదదృష్టి గలిగినది. జైనబౌద్ధమతములు ప్రబలి బ్రాహ్మణప్రాబల్యమును తగ్గించినవి. జైనబౌద్ధ మతములు బ్రాహ్మణ్యమును బ్రతిఘటించినను బ్రాహ్మణులపట్ల శత్రుత్వమును బూనలేదు. బౌద్ధధర్మములు ఖండించినను బ్రాహ్మణధర్మమును గారవించినవి. ధమ్మపదమునందు బ్రాహ్మణవర్గమనునధ్యాయము గలదు. ఆ వర్గమునందు బ్రాహ్మణధర్మములు నిర్దేశింపఁబడినవి. వైదికమత పరిణామము నందుఁ గర్మయోగమును, జ్ఞానయోగమును భక్తిమార్గము జీవయాత్రయందు సమన్వయము చేయుచున్నది. కర్మమార్గము జ్ఞానమార్గమునకు సాధనంబైనను బ్రాహ్మణాధీనంబైన నిత్యకర్మానుష్ఠానము ప్రాణకళను గోల్పోయి ప్రజల నిత్యజీవయాత్రకు నిరర్థకమైనది. కర్మాధికారులు గాని ప్రజలు జీవయాత్రయందు దారితెన్ను తెలియక పరితపించుచుండిరి. తత్త్వజ్ఞుల సిద్ధాంతములును అందరానిఫలములై, ప్రజ లజ్ఞానాంధకారము నందు మునిఁగి యుండిరి. ఇట్టి విషమదశయందు వర్ధమానుఁడు, సిద్ధార్థుఁడు మొదలగు క్షత్రియవీరులు బ్రాహ్మణాధికారమును బ్రతిఘటించి జైనబౌద్ధాది మతములను స్థాపించి, ప్రజలయందు నూతనమైన ప్రాణకళను బ్రతిష్ఠించిరి.

జైన బౌద్ధమతములు

సిద్దార్థ, వర్ధమానులు నిర్జీవమై క్రూరమైన కర్మకాండను, దుర్గ్రాహ్యమైన జ్ఞానమార్గమును నిరసించి ప్రజాజీవనమునందు ధర్మమార్గమును బ్రతిష్ఠించిరి. బుద్ధదేవుఁడు సంకుచితమైన బ్రాహ్మణకర్మానుష్ఠానమును నిరాకరించినను విశాలమైన కర్మసిద్ధాంతమును బ్రతిష్ఠించెను. యజ్ఞయాగాదిపరమైన కర్మ విశ్వవ్యాపకమైన కర్మభావమును బొందినది. వైదికమతమునందు మంత్రోదిష్టమై యిష్టదేవతాపరమైన కర్మ బౌద్ధమతమునందు సర్వవ్యాపకత్వమును బొందినది.