పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాస్త్రిగారి సాహిత్యకృషిని గుర్తించి తి. తి. దేవస్థాన యాజమాన్యం 2007వ సం॥లో శ్వేతభవనంలో "శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయపీఠాన్ని" స్థాపించి, వారు రచించిన ముద్రిత, అముద్రిత గ్రంథాలను తి. తి. దే ద్వారా ప్రచురించి ఆంధ్రసాహితీ లోకానికి అందించడానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు ఈ పీఠం "తెలుగుమెఱుగులు, మీగడతఱకలు, సింహావలోకనము, పూలవిందు, ప్రజ్ఞాప్రభాకరము-గురుపూజ, అన్నమాచార్యచరిత్ర పీఠిక, కేయూరబాహుచరిత్ర, వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయసూచిక , వేటూరివారి పీఠికలు 1, 2 భాగాలు, శ్రీ వేంకటేశ్వర స్తుతిరత్నమాల, చాటుపద్య మణిమంజరి ప్రథమ, ద్వితీయ భాగాలు” అనే గ్రంథాలను ప్రచురించింది.

ప్రస్తుతం ఫిబ్రవరి 7, 2013వ తేదీన శ్రీ ప్రభాకరశాస్త్రిగారి 125వ జయంతి సందర్భంగా శాస్త్రిగారి "బసవపురాణము” అనే గ్రంథాన్ని దీనికి అనుబంధంగా “బసవోదాహరణమును” శ్రీ ప్రభాకరశాస్త్రి వాఙ్మయపీఠం ద్వారా తి. తి. దేవస్థానం ప్రచురించింది.

శ్రీ ప్రభాకరశాస్త్రిగారి 125వ జయంతి సందర్భంగా ఆవిష్కరింప బడుతున్న ఈ బసవపురాణ ద్విపద కావ్యమును, బసవోదాహరణమును సాహిత్యాభిమానులైన వారందరు తప్పక ఆదరించి పఠించగలరని ఆశిస్తున్నాము.

(ఎల్.వి. సుబ్రహ్మణ్యం)