పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/483

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తొలిపలుకు

పాల్కురికి సోమనాథకవీశ్వర ప్రణీతములయిన తెల్గుగ్రంథములలో నేఁటి చరిత్రపరిశోధకులింతదాఁక దీనిఁదాఁకలేదు. బసవపురాణ పీఠికలో నేను దీని యాద్యంతములఁ జూపితిని. సంబోధనముతో నెన్మిది యగు విభక్తులతో నెన్మిది పద్యములును, కళికలును, నుత్కళికలును నెల్ల విభక్తులతోఁ గడపటిపద్యమును గల స్తుతిప్రశంసాపరమయిన గ్రంథమున కుదాహరణ మని పేరు. సంస్కృతాంధ్రకావ్యలక్షణకారులు దీని లక్షణమును నిర్వచించిరి. తెలుఁగునఁ గల యుదాహరణములలోనికెల్ల నిదియే ప్రాచీనమయినది. రావిపాటి త్రిపురాంతకుని త్రిపురాంతకోదాహరణము దీనికంటెఁ దర్వాతి దయినను, దీనికంటె హృద్యతరము. ఇందుఁగడపటి పద్యమున సప్తమీ విభక్త్యంతపదము, బసవవాచకముగా లేదు. 'నీయందు' అని యా పద్యమునఁజేర్పఁగుదురదు. పద్యపాఠము సరిగాదేమో! చతుర్థీవిభక్తి రూపములిందుఁ బర్యాలోచింపఁదగినవి. ప్రాఁతకాలపుఁదెల్గుకృతి గాన యభిమానమున దీనిని బ్రకటించితిని. సంస్కృతకర్ణాట భాషలలో నీ కవి రచియించిన లఘుకృతులను శ్రీ బండారు తమ్మయ్యగారు ప్రకటింపఁదలంపుగొన్నట్లు నాకుఁ దెలిపిరి. అట్లు వారు ప్రకటించినచో సోమనాథుని కృతులెల్ల వెల్లడి యయినట్లగును.