పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/425

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

218

బసవపురాణము

నా విప్రుఁడత్యద్భుతాక్రాంతుఁడగుచు - భావించి యప్పుడ పరు విడి యేఁగి
మాదర దూడయ్య మజ్జనోదకని - పాదితం బగుఱొంపిఁబడి పొర్లిపొర్లి
యాడుచుఁదనువు దివ్యాంగమై యున్న - నాడనా మాదర దూడయ్యగారి
పాదాబ్జములమీఁదఁబడి కృపవడసి - భూదేవకులుఁడంతఁబోయె నింటికిని
జూడుఁడా మాదర దూడయ్య యిట్టు - లాడినచోటినీ ళ్లప్పయగారు
[1]పడిలేచి ఱొంపిఁదాఁగడిగిన యంత - నడఁగెఁగుష్ఠవ్యాధి హరహరా తొల్లి
యాదిత్యుఁడును మనోహరుఁడనుగణము - పాదోదకములను బడసెఁ దా మేను
ననిచెప్ప వినబఁడు నాద్యోక్తులందుఁ - గనుఁగొంటిమిపుడు నిక్కంబుగా ననుచు
వినుతింపుచును నరుల్ విభ్రాంతిఁబొంద - విని వారివారికిఁజనుదెంచి యచటఁ
బొరల నేడ్నూర్వురు భూసురోత్తముల - కరయఁగుష్ఠవ్యాధులణఁగుట వినవె.

బానస భీమయ్యగారి కథ


పృథివిలో బానస భీమయ్య నాఁగఁ - బ్రథితుండు మెయిసెడ్డ పాఱులకెల్ల
మేనులు కృప[2]సేయుటేనాఁట వినవె - భూనాథ! జనులెల్లఁబొగడఁగమఱియుఁ
జక్కన ముచ్చట్లు జరపఁగనేల - యిక్కర్మచండాలు రెంతటివారు

శ్వపచయ్యగారి కథ


సామవేదులు నాఁగఁసద్బ్రాహ్మణుండు - శ్రీమతి నాకాశగామియై యరుగ
శ్వపచయ్య నాఁగ నీశ్వరభక్తుఁడొకఁడు - విపినాంతరమున సద్విధి నోగిరంబు
లొనరించుచును మీఁదఁజనుసామవేదిఁ - గని పొందునో వీని కర్మంపుదృష్టు
లనుచు నోగిరముఁ జెప్పున మూయఁదడవ - కని సామవేదులు కలకల నగుచు
శ్వపచుండుఁదాను మాంసంబు వండెడిని - కపటుండు మా పొడగని మూసెఁజెప్పు
ఇట్టి దుర్జనుఁడగునే యని తలఁపఁ - జట్టనఁదన్మంత్రశక్తి యణంగి
యంతరిక్షంబున నాడు దోవతులు - నంత నబ్బువిఁబడ్డ నతఁడప్డు వచ్చి
శ్వపచయ్యగారి శ్రీ చరణాబ్దములకు - నపరిమిత ప్రీతి నందంద మ్రొక్కి
శివదీక్ష వారిచే శిష్యుఁడై పడసి - సవిశేషమగు తత్ప్రసాదంబు మహిమఁ
జేసి కొంపోవఁడే శివలోకమునకు - నాసక్తి ముప్పదియా ఱూళ్ల వారిఁ
గాన పురాతనగణములనాఁడు - లేనిమార్గము వుట్టెనే నేఁడు భక్తి

  1. పడియులేచిన ఱొంపిగడిగికొన్నంత
  2. సేయుటేనియు