పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

బసవపురాణము

గూర్చి తెగడి పలికెను. రాజంతట నటనుండి యరిగెను. పురాణమును వినుచున్న శివభక్తు లా ధూర్తవిప్రునిఁ జంప ననుజ్ఞఁ బడయుటకయి పాల్కురికిపురమున నున్న సోమనాథునికడ కేఁగిరి. వారి యభియోగమును విని సోమనాథుఁడు దా నూరకున్నచో భక్తులకుఁ దలవంపు కాఁగలదని యాగ్రహించి భవులతో సందర్శన సంభాషణ సంబంధము లేనివాఁడయినను విధిలేక వివాదమునకు సిద్ధపడెను. అల్పమానవునిచే నా ధూర్తవిప్రుని గెలిపించెదనని ప్రతిన పూనెను. లింగముద్రలు గల యెడ్లను గట్టిన గుడారుబండిలో నెక్కి శిష్యులతో సోమనాథుఁ డోరుఁగంటికి బయలుదేరెను.

వీరిరాక నోరుఁగంటిలోని ప్రతివాదు లెఱిఁగి యల్లరిగాండ్ర గొందఱ గుమిగూర్చి లింగముద్రలు దగిలించి సోమనాథు నెదుర్కొనఁ బంపిరి. వాండ్రట్లు వచ్చి సోమనాథునకు మ్రొక్కఁగాఁ గృత్రిమముగాఁ దాల్చిన లింగచిహ్నములు వాండ్రకు సహజములయ్యెను. అంతవారును సోమనాథుని శిష్యులై వెంబడించిరి.

సోమనాథాదు లోరుగంటి కోటగవనికిఁ జేరవచ్చిరి. బండియెడ్లు గజలక్ష్మి విగ్రహమును జూచి లోనికిఁ జొరవయ్యెను. సోమనాథుఁడు తొలఁగిపొమ్మని పలుకఁగా నా విగ్రహము తునిసి నేలఁబడెను. అది విని ప్రతాపరుద్రుఁడును, ప్రత్యర్థులును భయపడి వచ్చి విధేయులై సోమనాథునకు నమస్కరించిరి. అతఁడు వారి నాశ్వాసించెను. కొన్నిదినము లక్కడ భక్తుల ప్రార్థనమున నివసించెను.

త్రికాలవేదిగాన సోమనాథుఁడు పిడుపర్తి శివరాత్రి కొప్పయ్య మొదలగు శిష్యులఁ బిలిచి “యీ దేశ మిఁకఁ గొలఁదికాలమునకుఁ దురుష్కాక్రాంతము గాఁగలదు. మాబోఁటి నియమస్థుల కిక్కడ నుండరాదు. మీకొఱకై యీ రాజ్యమున నొకగ్రామము సంపాదించియిత్తును” అని తెలిపి తన శిష్యుఁడును బ్రతాపరుద్రుని మంత్రియునగు నిందుటూరియయ్యన్నను బిలిచి, యాయన మూలమున దోకిపర్తి నగ్రహారముగాఁ బడసి, యందు శిష్యులతోఁ గొంతకాలము వసియించెను. పదపడి యాతఁడు "నాకు వార్ధకము గదిసెను. ఇఁక బాహ్యకర్మములు మాని సమాధిస్థితిని బడయుదు” నని శిష్యులకుఁ దెలిపి యాంధ్రదేశము వీడి కర్ణాటదేశమున శివగంగాక్షేత్రము చేరువను గల 'కలికె' మను నగ్రహారమునకుఁ జేరెను. అక్కడ