పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్ధాశ్వాసము

117

రక్షింపవే యోగిరములు శాకములు - అక్షయాత్మక! చల్లనారకయుండ”
ననుచు మ్రొక్కుడును దదంగనఁ జూచి - "పనిచిన 'నౌఁగాక' యని పిల్వరాదె
తల్లి విల్చిన రాని [1]తనయులు గలరె - తెల్లంబుగా నాల్గుదిక్కుల నిలిచి
యెలుఁగెత్తి పిలువుమా యేము వినంగ - నలరుచు రాకేమి యట్లయుండెడినొ"
అనవుడు "నుత్తరం బాడంగ నేల” - యనుచు నేతెంచి తూర్పాదిగా నిలిచి
చెలఁగుచుఁ దాపసిచెప్పినయట్టు - లెలుఁగెత్తి సుతుఁ దల్లి విలువఁగఁదొడఁగె

సంగళవ్వ కొడుకును బిలుచుట


“పూర్వజన్మార్జితభూరికర్మములు - గుర్వణఁగించు నా కొడుక! రావయ్య!
దక్షిణాధీశ్వరుదర్పమడంచు - దక్షతగల్గు నాత్మజుఁడ రావయ్య!
విరసపశ్చాజ్జన్మమరణదుఃఖములు - [2]పొరిమాల్పఁ జాలు నా పుత్త్ర! రావయ్య!
ఉత్తరంబేలు నుదాత్తయోగీంద్రు - చిత్తంబునకు వచ్చుశిశువ! రావయ్య!
అలరు నా కోపభోగాతీతపదము - లలవడె నేఁడు నాయయ్య! రావయ్య!
దండధరోద్దండ దండప్రశక్తి - ఖండింపనోవు పుత్త్రుండ! రావన్న!
పాయనివ్యామోహపాశబంధములు - కోయంగఁజాలు నా కుఱ్ఱ! రావన్న!
ద్రవిణాదికేషణత్రయ విజృంభణము - తవులునఁ బడని నా తండ్రి! రావన్న!
సురరాజనుతుఁడు విశ్రుతతపోవేషి - వరదుఁడైనాఁడు నా వడుగ! రావన్న!
అంతకాంతకమూర్తియగు తవరాజు - సంతసంబంద నా సామి! రావన్న!
ఘోరనిస్సార సంసారవారాశి - పార మీఁదించుపాపండ! రావన్న!
అంచితాగణ్య పుణ్యప్రాప్తి నమరు - కాంచీవిలాసు నగ్రజుఁడ రావన్న!
దివిజకన్యకలతో దివి ముక్తికన్య - కవయనున్నది భక్తికాంతుండ! రావె!
దందడి మీయయ్య దక్షిణభుజము - నందంద యదరెడినన్న! రావన్న!
భానుఁడెంతేనియుఁ బడుమట వ్రాలె - శ్రీనిలయుండ! నా సీరాల!రావె!
స్వాదొంద నర్దేశసఖునిసన్నిధిఁ బ్ర - సాదంబుఁ గొనఁగ నా గాదిలి! రావె!
అనుచు నాలుగుదిక్కులందు నందంద - తనయునిఁ బిల్చుశబ్దంబులోపలను
జనితమై దిక్కులసంజ్ఞలు దోఁప - వనితాలలామ విల్వంగ నంతటను
గుండలంబులు గ్రాలఁ[3]గూఁకటి వ్రేల - [4]మండనం బొలయ సౌమ్యపుఘంట లులియ
రావిరేకయుఁ దూల భావంబు వోల - నా విధియు నదల హర్షంబు వొదల

  1. తనయుండుగలఁడె?
  2. పరిమాల్పఁ జాలునాపట్టి
  3. గూకటల్ వ్రా(వ్రే)ల
  4. మండలం