పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

99

బసవనియెదుటఁ బెంపెసఁగంగ నిలిచె - నసముండు మాదిరాజయ్య తత్క్షణమ
ఇట బసవఁడు సంగమేశ్వరు [1]నందు - నటమున్న పొడగాంచి సాష్టాంగ మెఱగి
మ్రొక్కునమ్మాత్రన ముందటనున్న - నక్కజుండగుచు నందంద మ్రొక్కుడును
వత్సలత్వంబు నివ్వటిలంగ నతులి - తోత్సవలీలమై నుల్లసిల్లుచును
నంచితలింగసుఖాపారసార - సంచితామృతవార్ధి ముంచి యెత్తుచును
బసవనిచేఁబూజ వడయుచునుండె - నసలార మాదిరాజయ్యగారిట్టు
లీ జగత్త్రయి సకలేశ్వర మాది - రాజయ్యగారి నిర్మల చరిత్రంబు
విస్తరించినఁ బ్రీతి విన్న వ్రాసినను - బ్రస్తుతభక్తి శుభంబులు సెందు
ధీమణి! సుజనచింతామణి! బుధశి - ఖామణి! ధర్మరక్షామణి! శుద్ధ
శరణజనానందకరణ! సత్పథవి - హరణ! సంతతదయాభకరణచేతస్క
లలిత నిర్మలయశః కలితదిగంత! - ఫలిత సద్భక్తి సమ్మిళితాంతరంగ!
రహితషడ్భావ! [2]విరచితసద్భావ! - మహిత తత్త్వార్థ సన్నిహితావధాన
విదిత ప్రసాద సంవిత్సౌఖ్యభోగ - ముదితాత్మ సంగత సుఖసుధాశరధినిమగ్న
ఇదియ సంఖ్యాత మాహేశ్వరదివ్య - పదపద్మ సౌరభభ్రమరాయమాణ
జంగమలింగ ప్రసాదోపభోగ - సంగత సుఖసుధాశరధినిమగ్న
సుకృతాత్మ పాలుకురికి సోమనాథ - సుకవిప్రణీతమై శోభిల్లి తనరి
చరలింగ ఘనకరస్థలి విశ్వనాథ - వరకృపాంచితకవిత్వస్ఫూర్తిఁబేర్చి
చను బసవపురాణమను కథయందు - ననుపమంబుగఁ దృతీయాశ్వాసమయ్యె.

  1. నంద యట
  2. విరహితదుర్భావ