పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxi



దా నెఱుంగక లింగతత్పరుం డగుచు - జానొంద శివుఁ గొల్వ శరణుఁడౌ నతఁడు
ఒలసి షడ్వర్గషడూర్మిషడ్భ్రమల - నలర కష్టవిధార్చనంబును లేక
శర్వునకుఁ దనకు సందింత లేక - నిర్వాణపద మంది నిర్భావుఁ డగుచు
ఒగి శిఖికర్పూరయోగంబుభంగిఁ - దగిలి వర్తించునాతఁడు శివైక్యుండు

-దీక్షాబోధ 81-82

శ్రీకృష్ణపరమాత్ముఁడు ఉపదేశించిన భక్తిమార్గమునే లింగధారణరూపమున వీరశైవము వ్యక్తముచేయుచున్నది. సాధకుఁడు చిత్తమును శివునియందు లయముచేయుటకు నిరంతరమైన శివధ్యాస సాధనముగ నున్నది. అభ్యాసమువలన ధ్యాస కల్గుచున్నది. జంగమార్చనలవలనను అభ్యాసమును, కర్మఫలత్యాగమును, శివసందర్శనమును గలుగుచున్నవి. బాహ్యాభ్యంతరముల గురులింగజంగమలింగార్చనలందు సాధకునకు భక్తిస్వరూపము గోచరం బగుచున్నది. బసవచరిత్రయందు సామాన్యజనులు మహాభక్తులై శివసాయుజ్యమును బొందినవిధము మనోహరముగ వివరింపఁబడినది. బసవమతము వైదికమతమును బ్రతిఘటించినను నిగమాగమపురాణాదులందుఁ బ్రతిపాదితములైన సాధనలను స్వీకరించి లింగధారణకు బ్రముఖతను గల్పించినది. వీరశైవము కొంతకాలము మహావ్యాపకత నొందినది. కాలక్రమమునఁ జిన్మయదీక్ష, లింగధారణము కులాచారములై, భేదావరణమును గల్పించి, వ్యక్తివికాసమునకును, సంఘజీవనమునకును, మానవకల్యాణమునకును నిరర్ధకములై, వీరశైవప్రతిభను తగ్గించినవి.

సాధ్యము

జీవుఁడు జీవయాత్రయందు శివస్వరూపమును బొందుట జీవయాత్రకుఁ బరమప్రయోజనము. "అహం బ్రహ్మాస్మి,” “తత్త్వమసి,” “శివో౽హం ” ఇత్యాది మహావాక్యార్థములను జీవయాత్రయందు సార్థకము చేయుటకు వీరశైవము తలపెట్టినది. లింగధారణము శివభక్తులందు ద్వైతభావమును బోఁగొట్టి అద్వైతభావమును వ్యక్తముచేయుచున్నది. పరమశివుఁడు, జీవుఁడు, ప్రకృతి, ఆత్మ, జీవుడు, దేహము; గురువు, లింగము, జంగము; భావలింగము, ప్రాణలింగము, ఇష్టలింగము; లింగశరీరము, సూక్ష్మశరీరము, స్థూలశరీరము; నాదము, బిందు,