పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxii

బసవపురాణము


కళ: ఇత్యాది త్రివిధభావరూపములను విశ్వమంతయును గోచరంబగుచున్నది. సృష్టికి వ్యక్తరూపమైన నాదము, విశ్వమును లింగరూపమున నావరించి, కళారూపమునను సువ్యక్తమగుచున్నది. నాదము, చైతన్యకళారూపమున సహస్రారమునందు విలసిల్లుచుఁ బ్రాణకళల నాకర్షించుచున్నది. ప్రపంచమంతయును జైతన్యాధిష్ఠితమైన జంగమస్థావరరూపములను బ్రభవించుచు శ్రేయఃప్రాప్తికి సాధనంబుగ నున్నది. బాహ్యాంతరములందు లింగధారణము పంచభూతములను, దశేంద్రియములను, అంతఃకరణచతుష్టయమును వేధించి సాధ్యమును జేరుటకుఁ బరమసాధనమని వీరశైవము బోధించుచున్నది. లింగాంగి జంగమలింగప్రసాదమునందు ఇష్టార్థసిద్ధిని, గురులింగప్రసాదమునందు భావార్థసిద్ధిని గలిగి, నైష్కర్మ్యఫలసిద్ధిని బొందుచు, శివకైవల్యమును బొందుచున్నాఁడు. వీరశైవమతసాంప్రదాయములు తీర్థప్రసాదములమహిమను విశేషముగ బోధించుచున్నవి. శ్రీ గురుప్రసాదము స్థూలరూపమునను, భావరూపమునను సాధకునిఁ జిన్మయునిఁ జేసి, శివభక్తగణమునందుఁ జేర్చుచున్నది. జంగమార్పితములైన యిష్టపదార్థములు శివార్పితములై మహాప్రసాదభావమున సాధకునకు శివప్రసాదమును గలుగఁజేయుచున్నవి. మానవుల సుఖదుఃఖములకు కోపప్రసాదములు గారణంబులుగ నున్నవి. కోపము పశులక్షణమై దుఃఖమును, ప్రసాద మీశ్వరలక్షణమై సుఖమును గలుగఁజేయుచున్నవి. భక్తియుక్తమైన శ్రీ గురులింగజంగమప్రసాదము శివసాయుజ్యమునకు సాధనమై యున్నది. భావప్రాణేష్టలింగపరమైన శ్రీ గురులింగజంగ మైక్యాత్మకమైన వీరశైవతత్త్వము, వీరశైవమునకు శివాద్వైతమును బ్రతిపాదించుచున్నది. శైవసిద్దాంతములు ద్వైతప్రతిపాదకములనియును, ద్వైతాద్వైతప్రతిపాదకము లనియును, అద్వైతప్రతిపాదకములనియును భిన్నాభిప్రాయములు ప్రబలియున్నను వీరశైవము శివాద్వైతమును బ్రతిపాదించుచున్నదని పండితాభిప్రాయము.

ఆ లింగమునకుఁ బంచామృతస్నపన - మోలిఁ గావించి సర్వోపచారముల
నర్చించి ధూపదీపాదు లర్పించి - చర్చింప సూక్ష్మమై సకలదిక్కులను
బరమసత్కళ మున్నె భరితమైయున్కి - నరయ శిష్యుని శిరంబందున్నకళను
గని గురుమూర్తి యాకర్షించి లింగ- మునయందు మంత్రోక్తముగఁ బ్రతిష్ఠించి