పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30

బసవపురాణము

జేరువ నాడెడు పేరణివిధము - సౌరాష్ట్రనాయకుసంప్రదాయంబు
వేడుకఁ బ్రతిజోకలాడెడువారుఁ - గూడలి సంగయ్య [1]కొలువునర్తకులుఁ
బాడుచు నట విండ్లపై [2]గజ్జెపరువు - లాడెడువారు [3]రాయనికొల్వువారు
సంగతి నేఁగు తురంగ[4]సంఘముల - పింగల బిజ్జలు ముంగలనొప్పు
వర[5]గజారూఢులై యరుదెంచుచున్న - పరమమాహేశ్వరప్రకరంబునడుమ
శివభక్తజనులమీఁదివ దృష్టులుఁగాఁగ - సవినయసంభ్రమాసక్తి మ్రొక్కుచును
నలఘుసన్మణికలాపాంశులు ప్రజ్వ - రిలు మౌక్తికచ్ఛత్రములగమి [6]నీడ
నతమంత్రిజనశిరోనాయకరత్న - వితతిఁ గూడిన పదాన్వితనఖములను
నెలమిఁ దలిర్చు భద్రేభంబు నెక్కి - యలరారుచున్నట్టి యలమహామహునిఁ
[7]గారుణ్యమూర్తి విక్రమచక్రవర్తిఁ - జారునిర్మలకీర్తి సత్యప్రపూర్తి
గలియుగరుద్రు సత్కరుణాసముద్రు - విలసనభద్రు సద్వినయనిర్ణిద్రు
ధీరు సద్భక్తిశృంగారు నేకాంగ - వీరు నా బసవకుమారుఁ జూచితిరె”
అనవుడు నందఱుఁ గని యట్లుమ్రొక్క - వనితకు మఱియొక్క వనిత యిట్లనియె
“నలినాక్షి! యీతఁడే నందీశమూర్తి - పొలఁతి! యీతండె త్రిభువనపావనుఁడు
వనిత! యీతఁడె భాగ[8]వాడ మాదవ్వ - మను [9]నోమిపడసిన యనుఁగుఁబుత్త్రుండు
పడఁతి! యీతఁడె మనబలదేవమంత్రి - కడుఁ [10]గూర్చి యిచ్చిన కన్యకమగఁడు
సన్నుతాంగి! యితండె సంగయ్యదేవు - మొన్నఁబల్కించిన ముల్లోకనుతుఁడు
[11]మడఁది! యాతండె యిమ్మనుజేశుచేతఁ - గడునొప్పుమన్నన వడసినయతఁడు
కన్నులపండు వీ యన్నఁ జూచినను - బన్నుగా జిహ్వలపండువు వొగడ
నిట్టి ధన్యల మౌదుమే నేఁడు మనల - పుట్టువు సఫలతఁబొందె నెంతయును”
నని యిట్లు చెప్పుచునడుగుచు జనులు - వినుతింపఁగాఁ బురి [12]వెసఁ జొచ్చునెడను
జగతీతలేశుండు నగరోపకంఠ - మగడు నా బసవయ్య నర్థి దోడ్కొనుచుఁ
బరిమితభటమంత్రి పరివృతుం డగుచు - నరుదెంచి భవనాశ్ర[13]యాభ్యంతరమున
మున్నున్నమంత్రులు పన్నిద్ధ[14]ఱకును - [15]గన్నాకుగాఁ బెద్దగద్దియ నునిచి
వరవస్త్రభూషణోత్కరము లర్పించి - యరుదొంద బసవయ్య కాతఁ డిట్లనియె

  1. గొలుచు
  2. సజ్జపఱపు, గుజ్జుగురపు, గట్టివరపు
  3. రాయనిఁగొల్చువారు
  4. భట్ట
  5. రథా
  6. నడుమ
  7. ఈ క్రింది నాల్గు చరణములు పెక్కు ప్రతులలో లేవు
  8. మాదాంబ
  9. నోఁచి
  10. గూర్మిని
  11. మడఁతి
  12. జనఁ
  13. మా
  14. ఱందు
  15. గన్నారఁ