పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

98

బసవపురాణము


గూర్చుకొనఁగల్గిరి. కాలక్రమమునఁగూడ నాపూన్కి యట్లే సాగుచుండఁ గల్గెనేని యాంధ్రకర్ణాటదేశములందు జాతిభేదము సమసిపోయికూడ నుండవచ్చును. కాని, దానిఁ బ్రబలముగాఁ బ్రతిఘటించిన యద్వైతాదిమతముల యధికవ్యాప్తిచే, నానాజాతులనుండి క్రొత్తక్రొత్తవారు నాఁటనాఁట వీరశైవు లగుచుండుటగాని, తన్మూలమున జాతిభేదములు సమయుటగాని సందర్భింప దయ్యెను. తర్వాతి కాలమున నక్కడక్కడఁ గొందఱు కొందఱు కొలఁది కొలఁదిగా మాత్రమే వీరశైవదీక్ష గొని యాసంఘమునఁ జేరిరి. దానిచే బసవేశ్వరాదుల కాలమున వేర్పడి యేర్పడిన శైవదీక్షితుల వంశపరంపరలును దర్వాతివారు కొలఁదిమందియు మాత్రమే కూడి నేఁడు లింగాయతులను పేరఁ బ్రత్యేకసంఘమై వెలయుచున్నారు.

ఇటీవలికాలమున నా మతమునఁ గ్రొత్తగాఁ జేరినవా రంతగా లేకపోవుటచే జాతిభేదమును బాటింపరాదను సిద్ధాంతమును స్థాపింపఁబూనిన యా సంఘమే సంకుచితమై తాను నొకజాతియై తనకు ముందున్న జాతులకంటె నింక నొక్కజాతిని హెచ్చింపఁగల్గెనే కాని, జాతిభేదమును సమయింపఁజాలదయ్యెను.

వీరశైవమతస్వరూపము, వీరాగమము, వీరశైవాచారసంగ్రహము మొదలగు గ్రంథములందుఁ గానవచ్చును. బసవేశ్వరుని సమకాలము వాఁడగు కెరెయ పద్మరసు రచియించిన వీరశైవదీక్షాబోధలోఁ బ్రధానవిషయము లెల్ల జక్కఁగా స్పష్టపఱుపఁబడి యున్నవి. పిడుపర్తి సోమనాథుని తెలుఁగు దీక్షాబోధను జదివి వీరశైవమతస్వరూపమును జక్కఁగాఁ దెలిసికొనవచ్చును.

శివకవులు

వీరశైవులలోఁ గవీశ్వరులగువారు శివునిమీఁదను దద్భక్తులమీఁదను దక్క నితరులగు భవులమీఁద నెప్పుడును గృతులఁ జెప్పెడివారుగాదు. కావున, వారికి శివకవులని పేరు గల్గెను. కర్ణాటాంధ్రగ్రంథములలో శివకవుల ప్రశంస పెక్కుచోట్లఁ గలదు. శివకవులు భవికవుల గర్హించిరి. కవితలోఁగూడ వారు వేఱుమతము వారయిరి.

ఐనను లోకహితార్ధంబు గాఁగ
నానేర్చు కొలఁది వర్ణనసేయువాఁడ