పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

87


క. ప్రాజ్ఞులు వేదజ్ఞులు లో
   కజ్ఞులు చేకొండ్రె గతశిఖాగాయత్రీ
   యజ్ఞోపవీతనాస్తికు
   లజ్ఞులు చేకొండ్రుగాక యద్వైతమజా!

శ్రీకంఠభాష్యము గూడ సన్న్యాస మావశ్యకమనుటలేదు. పాశుపతులు విశిష్టాద్వైతసిద్ధాంతమువారు. మల్లికార్జున పండితారాధ్యులవారి శివతత్త్వసార మీవిషయమును స్పష్టముగాఁ దెలుపుచున్నది :

క. వేదోక్తసదాచారా
    పాదనమున నెగడునట్టి పశువులకుఁ బురా
    పాదితదురితక్షయమై
    యాదరమున ధర్మ మధిక మగు నీశానా!

క. ధర్మాధిక్యంబున నతి
   నిర్మలబోధయు విరక్తినిష్ఠయుఁగల య
   క్కర్ములకు నీ ప్రసాదము
   పేర్మిని శివభక్తి పుట్టుఁ బృథుభావమునన్.

క. మానితశివభక్తి శివ
   జ్ఞానధ్యానముల నీ ప్రసాదాతిశయా
   నూనతఁ గర్మక్షయమై
   యానందప్రాప్తి ముక్తుఁడగు నీశానా!

విశిష్టాద్వైతసిద్ధాంతమునకు జీవగఱ్ఱ యనఁదగిన శ్రుతి (నాయ మాత్మా ప్రవచనేన లభ్యో న మేధయా న బహునా శ్రుతేన, యమై వైష వృణుతే తేన లభ్యస్తస్యైష ఆత్మా వివృణుతే తనూం స్వామ్) ప్రతిపాదితమయిన యర్థమునే పయిపద్యములును జెప్పుచున్నవి.