పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చరిత్ర మనకేమి బోధించును ?

27


నేటికాలమున పలువురు మన గొప్ప నాగరీకతను తలుచుకొనియు, శాస్త్రము కనిపెట్టిన యద్భుతవిషయములను తలుచుకొనియు మురిసి పోవుటకద్దు. శాస్త్రము అద్భుతవిషయములను కనిపెట్టినమాట నిజమే , శాస్త్రజ్ఞులు గౌరవార్హులే. కాని డాబులుకోట్టువా రెన్నడును గొప్పవారు కారు. అనేక విషయములలో మానవు. డితరజంతువులకన్న నెక్కువ యభివృద్ధిలోనికి రాలేదని జ్ఞాపకముంచుకొనుట మంచిది. కొన్నివిషయములలో కొన్నిజంతువులు మానవునికన్న ఉత్తమస్థితిలో నున్నవని చెప్పవచ్చునేమో! ఇది తెలివితక్కువమాటగా తోచవచ్చును. తెలివి తక్కువ మనుష్యులు నవ్వవచ్చును. నీ విప్పుడే మీటర్లింకు వ్రాసిన తేనెటీగజీవితమును గురించియు, చెదపురుగులను, చీమలను గురించియు చదివియున్నావు. ఈ కీటకములు తమ సంఘముల నెట్లు క్రమపద్ధతిలో పెట్టుకొన్నవో చూచి నీ వాశ్చర్యపడియుందువు. చేతనములందెల్ల నీ కీటకములు మిక్కిలి నీచములని మనము వీనిని ఈసడింతుము. అయినప్పటికిని ఈ చిన్నజీవులు మానవునికంటె బాగుగా సహకారవిద్య నేర్చుకొన్నవి ; సంఘ క్షేమమునకై ఆత్మార్పణముచేయుట నేర్చుకొన్నవి, అన్యోన్య సహకారము, సంఘ శ్రేయస్సునుగోరి ఆత్మార్పణముచేయుట నాగరీక లక్షణములైనచో చెదపురుగులును, చీమలును మానవునికన్న మిన్నలని తప్పక చెప్పక తప్పదు.

మన ప్రాచీన సంస్కృత గ్రంథములలో నొక శ్లోకమున్నది. దాని భావ మిది-- "కుటుంబముకొరకు వ్యక్తిని పరిత్యజించుము. సంఘము కొరకు కుటుంబమును పరిత్యజించుము. దేశముకొరకు సంఘమును పరిత్యజించుము. ఆత్మకొరకు లోకమును పరిత్యజించుము." ఆత్మయన నేమో బహుకొద్దిమందికి తెలియును. వారు దానిని గురించి చెప్పగలరు. మనలో ప్రతి యొక్కడు దానికి ఒక్కొక్క విధముగా అర్థము చెప్పవచ్చును. కాని ఈ సంస్కృతశ్లోకమునుబట్టి మనము నేర్చుకొనవలసిన విషయము - సహకారము. సంఘక్షేమమునకై ఆత్మార్పణము. చాలకాలమునుండి