పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జన్మదినలేఖ

19


మనము జ్ఞాపకముంచుకొనదగిన విషయ మొకటి యున్నది. మన యుద్యమమునకుగాని, మన ప్రజలకుగాని దుష్కీర్తి నాపాదించు కార్యములను మనము చేయరాదు. ఇండియా స్వేచ్చకు పోరాడు యోధులముగా మన ముండదలచినచో ఇండియా ప్రతిష్ట మనచేతులలో నుండును. దానిని నిలుపుట మనపవిత్రమగుభాధ్యత. తరుచు మసము కర్తవ్య విమూఢులము కావచ్చును. ఏది సరియైన మార్గమో, ఏది కాదో నిర్ణయించుట సులభము కాదు. సంశయముగా నున్నప్పుడెల్ల నీ విషయమును జ్ఞష్తియం దుంచుకొనుము. దానవల్ల నీకు లాభ ముండును. ఏ కార్యమును రహస్యముగా చేయకుము. ఇతరులకు తెలియజేయరాని కార్యము నెన్నడును చేయకుము. దాచవలెనను కోరిక భయలక్షణము, భయపడుట మంచిది కాదు. నీకు తగదు. ధైర్యము వహించియుండుము. పిమ్మట సర్వమును సక్రమముగా నడుచును, నీవు ధైర్యముగా నున్న నీకు భయముండదు. సిగ్గుపడవలసిన పని ఎట్టిదియు నీపు చేయజాలవు. బాపుజీ నాయకత్వమున నడచుచున్న మనగొప్ప స్వాతంత్ర్యోద్యమమున రహస్యవ్యాపారములకు తావు లేదు. దాచుకోవలసినది మన కేమియులేదు. మనము చేయు కార్యములనుచూచి మనము భయపడము. మనము చెప్పు మాటలను చూచి మనము భయపడము. పట్టపగలు, సూర్యకాంతితో మనము పని చేయుదుము. ఆట్లే మన సొంత జీవితములందు సైతము సూర్యునితో సఖ్యము చేయుదము. సూర్యకాంతిలో పనులు నెరపుదము. రహస్యముగా మన మేకార్యములు చేయవద్దు. చాటుమాటులు మన కుండవచ్చును. ఉండవలసినదే. కాని రహస్యము వేరు; చాటుమాటులు వేరు. తల్లీ, ఈవిధముగా నీవు చేసినయెడల నీవు పెరిగి పెద్దదానవై వెలుతురు బిడ్డ వగుదువు. నీకు భయముండదు, ఏది ఎట్లు వచ్చినను క్షోభచెందవు. శాంతముతో నుందువు.

నీకు చాల పెద్ద జాబును వ్రాసితిని. ఇంకను నీకు చెప్పదలచుకొన్న దెంతయోకలదు. జాబులో అదంతయు ఎట్లిముడగలదు ?