పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము--ఆ-4

205

పెద్దల మిమ్ముఁ గోపింపంగ రాదు ;
తద్దయు వివరింతుఁ దగవు దప్పకుఁడు.
అర్జునుఁ బట్టి నే సాహవక్షోణి
నిర్జింపఁగాఁ జూచి నీవె మెచ్చెదవు."
అనినఁ గౌరవనాధుఁ డర్థి ని ట్లనియె:
"వినుఁ డర్జునుఁ డె యైన వేయు నేమిటికి
భావింప మనదృష్టి పథమునఁ బడుటఁ
బోవు నింతియ కాక పొసఁగఁ గానలకు.
కాక వే ఱొకఁ డైన ఘన బాణతతులఁ
బ్రాకటంబుగ నేసి పాఱఁ దో లెదము.”
అనినయామాటల కాసేన లెల్ల
మనసులోపలను సమ్మతి సేయ సంత
నంచితశక్తి న ట్లరదంబు నిల్వఁ
బంచి యుత్తరుఁ జూచి పార్థుఁ డిట్లనియె :
"ఎలమితోఁ బాండవు లీజమ్మిమీఁద
నెలవుగాఁ దమశస్త్రనికరంబు లిడిరి.
అందులో గాండివం బవసరం బిపుడు
పొందుగా నిటు తెమ్ము భూనాధతనయ.
ఈవిండ్లు కుఱుచలౌ నేలీల నేయ
లావునఁ బస లేదు లఘువు లెంతయును.