పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉదాహరణములు

(ఏ) ఏ' అనునతడు 'జడ్' ను లేవకుండా పట్టుకొని 'జడ్' యొక్క సమ్మతిలేకుండ కపటముతో 'జడ్'దుస్తులనుండి డబ్బును, నగలను తీసికొనును. ఇచట 'ఏ' దొంగతనము చేసినాడు మరియు ఆ దొంగతనము చేయుటకుగామ 'జడ్' కు ఆక్రమ అవరోధమును స్వచ్ఛంధముగా కలుగజేసినాడు, కాబట్టి 'ఏ' దోపిడీ చేసినవాడగును.

(బీ) ఏ' అనునతడు 'జడ్' ను రహదారిలో కలసికొని, ఒక పిస్తోలును చూపి డబ్బుల సంచిని ఇమ్మని అడుగును. తత్పరిణామముగ 'జడ్' తన డబ్బుల సంచిని ఇచ్చి వేయును. ఇచట, తక్షణ ఘాత కలుగునని 'జడ్' ను భయపెట్టి, బలాద్గ్రహణముచేయు సమయమున ఆతని ఎదుటనే ఉండి 'ఏ' అతని డబ్బుల సంచిని బలాద్గ్రహణము చే సెను, కాబట్టి 'ఏ' దోపిడీ చేసిన వాడగును.

(సీ) 'ఏ' అనునతడు రహదారిలో 'జడ్' ను 'జడ్' యొక్క బిడ్డను కలిసికొనును. 'ఏ' ఆ బిడ్డను పట్టుకొని'జడ్' తన డబ్బుల సంచిని ఇచ్చి వేసిననే తప్ప, బిడ్డను కొండచరియలో పడవేయుదునని బెదరించును. 'జడ్' తత్ పరిణామముగ తన డబ్బుల సంచిని ఇచ్చివేయును. ఇచట ఎదుటనే ఉన్న బిడ్డకు ఘాత కలుగునని 'జడ్' ను భయ పెట్టుట ద్వారా 'జడ్' నుండి 'ఏ' డబ్బుల సంచిని బలాద్గ్రహణము చేసెను. కాబట్టి 'జడ్' ను 'ఏ' దోపిడీ చేసిన వాడగువు.

(డీ) “నీ బిడ్డ నా ముఠా చేతులలో నున్నది. నీవు మాకు పదివేల రూపాయలను పంపిననే తప్ప, ఆ బిడ్డను చంపివేయుదుము” అని చెప్పుట ద్వారా, 'ఏ' అనునతడు 'జడ్' నుండి ఆస్తిని పొందును. ఇది బలాద్గ్ర హణము మరియు అట్టిదిగ శిక్షింపదగినదే, అయినను తన బిడ్డకు తక్షణ మరణము కలుగునను భయము 'జడ్' కు కలిగింపబడిననే తప్ప, ఇది దోపిడీ కాదు.

బందిపోటు,

391. ఐదుగురు, లేక అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసికట్టుగా దోపిడీ చేసినపుడు గాని దోపిడీ చేయుటకు ప్రయత్నించినపుడు గాని కలిసికట్టుగా దోపిడీ చేయుచున్న లేక దోపిడీ చేయుటకు ప్రయత్నించుచున్న వ్యక్తులును, అట్లు చేయుటకు లేక ప్రయత్నించుటకు అచట ఉండి తోడ్పడుచున్న వ్యక్తులును మొత్తముగా ఐదుగురు లేక అంతకంటె ఎక్కువమంది అయినపుడుగాని, అట్లు చేయుచున్న, లేక ప్రయత్నించుచున్న, లేక తోడ్పడుచున్న ప్రతి యొక వ్యక్తి “బందిపోటు” చేసినట్లు చెప్పబడును.

దోపిడి చేసినందుకు శిక్ష.

392. దోపిడీ చేయు వారెవరైనను, పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి కఠిన కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు, మరియు ఆ దోపిడి రహదారి పై సూర్యాస్తమయ సూర్యోదయముల మధ్య చేయబడిన యెడల, కారావాసము పదునాలుగు సంవత్సరములదాక ఉండవచ్చును.

దోపిడీ చేయుటకు ప్రయత్నించుట.

393. దోపిడీ చేయుటకు ప్రయత్నించు వారెవరైనను, ఏడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి కఠిన కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జార్మానాకు కూడ పాత్రులగుదురు.

దోపిడీ చేయుటలో ఘాతను స్వచ్ఛందముగా కలిగించుట.

394. ఏ వ్యక్తి యైనను, దోపిడి చేయుటలో లేక దోపిడీ చేయుటకు ప్రయత్నించుటలో ఘాతను స్వచ్ఛందముగ కలిగించుచో, అట్టి వ్యక్తియు, అట్టి దోపిడీ చేయుటలో, లేక దోపిడీ చేయుటకు ప్రయత్నించుటలో అట్టి వ్యక్తి తొ సంయుక్త ముగా ప్రమేయముగల ఎవరేని ఇతర వ్యక్తి యు యావజ్జీవ కారావాసముతోగాని, పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి కఠిన కారావాసముతో గాని శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు,

బందిపోటు చేసినందుకు శిక్ష.

395. బందిపోటు చేయువారెవరైనను యావజ్జీవ కారావాసముతోగాని, పది సంవత్సరములదాకా ఉండగల కాలావధికి కఠిన కారావాసముతో గాని శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడా పాత్రులగుదురు.

హత్య తోకూడిన బందిపొటు.

396. కలిసికట్టుగా బందిపోటు చేయుచున్న ఐదుగురు లేక అంతకంటే ఎక్కువమంది వ్యక్తులలో ఏ ఒక్కరైనను ఆట్లు బందిపోటు చేయుటలో హత్య చేయుచో, ఆ వ్యక్తులతో ప్రతి ఒక్కరుసు మరణ దండన తోగాని, యావజ్జీవ కారావాసముతోగాని, పది సంవత్సరములదాకా ఉండగల కాలావధికి కఠిన కారావాముతో గాని, శిక్షింపబడుదురు. మరియు జుర్మానాకు కూడా పాత్రులగుదురు,

మరణము, లేక దారుణ ఘాత కలిగించుటకైన ప్రయత్నముతో కూడిన దోపిడీ లేక జందిపోటు.

397. దోపిడీ లేక బందిపోటు చేయు సమయములో ఆపరాధి ఏదేని మారణాయుధమును ఉపయోగించుచో లేక ఏ వ్యక్తి కైనను దారుణమైన ఘాత కలిగించుచో, లేక ఏ వ్యక్తి కైనను మరణము, లేక దారుణమైన ఘాత కలిగించుటకు ప్రయత్నించుచో, అట్టి ఆపరాధికి విధింపవలసిన కారా వాసము ఏడు సంవత్సరములకు తక్కువకానిదై యుండవలెను.