పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(జీ) ఎవరి స్వాధీనములోను లేకుండ ఒక రహదారిలో పడియున్న ఉంగరమును 'ఏ' అనునతడు చూచును. ఆతడు దానిని తీసికొనుట ద్వారా దొంగతనము చేసినవాడుకాడు. కాని, ఆస్తిని అపరాధిక దుర్వినియోగము చేసినవాడు కావచ్చును.

(హెచ్) 'జడ్' ఇంటిలో ఒక బల్ల పై 'జడ్' ఉంగరము పడి ఉండగా 'ఏ' అనునతడు చూచును. సోదా జరిగినచో తనను కని పెట్టుదురను భయముచే 'ఏ' ఆ ఉంగరమును తక్షణమే కైవసము చేసికొనుటకు సాహసించక, దానిని 'జడ్' కనుగొనుట ఎప్పటికీని అసంభావ్యమగు స్థలములో దాచును. ఉంగరము పోయిన విషయము మరువబడిన తరువాత దాచిఉంచిన స్థలమునుండి ఆ ఉంగరమును తీసికొని, విక్రయించవలెనను ఉద్దేశముతో 'ఏ' అట్టు దాచివాడు, ఇచట 'ఏ' ఆ ఉంగరమును మొట్టమొదటిసారి చూచి తీయగనే దొంగతనము చేసినవాడగును.

(ఐ) 'ఏ' తన గడియారమును, నగల వర్తకుడైన 'జడ్' అనునతనికి సరిచేయించుటకై ఇచ్చును. 'జడ్' దానిని తన దుకాణమునకు గొంపోవును. నగల వర్తకుడు ఆ గడియారమును శాసన సమ్మతముగ హామీగా ఉంచుకొనదగినట్టి ఋణమేదియు 'ఏ' అతనికి బాకీ లేడు. 'జడ్' దుకాణములోనికి 'ఏ' బహిరంగముగ ప్రవేశించి 'జడ్' చేతిలో ఉన్న తన గడియారమును బలాత్కారముగ లాగుకొని వెళ్లిపోవును. ఇచట 'ఏ' అపరాధిక అక్రమ ప్రవేశమును, దౌర్జన్యమును చేసియుండినప్పటికిని, అతడు చేసినది నిజాయితీ లేకుండ చేయనందున ఆతడు దొంగతనము చేసినవాడు కాడు.

(జె) 'జడ్' గడియారమును మరమ్మతు చేసినందుకు 'జడ్'కు 'ఏ' డబ్బు బాకీఉన్నందున, శాసన సమ్మతముగ ఆబాకీకి హామీగా ఆ గడియారమును 'జడ్' తనవద్ద ఉంచుకొనియుండగా, 'జడ్' యొక్క, బాకీకి హామీగా ఆ ఆస్తి 'జడ్'కు దక్కకుండ చేయు ఉద్దేశముతో, 'ఏ' ఆ గడియారమును 'జడ్' స్వాధీనము నుండి తప్పించి 'ఏ' తీసికొనినచో, అతడు దానిని నిజాయితీలేకుండ తీసికొనినందున దొంగతనము చేసినవాడగును.

(కె) అటులనే, 'ఏ' తన గడియారమును 'జడ్' వద్ద కుదువ పెట్టి ఆ గడియారము పై తాను తీసికొనిన అప్పును చెల్లించకుండ, 'జడ్' సమ్మతి లేకుండ ఆ గడియారమును “జడ్' స్వాధీనము నుండి తప్పించి తాను తీసికొనినచో, ఆ గడియారము అతవిదేయైనను, ఆతడు దానిని నిజాయితీ లేకుండ తీసికొనినందున, దొంగతనము చేసిన వాడగును.

(ఎల్) 'జడ్'కు చెందిన వస్తువును 'జడ్' స్వాధీనము నుండి తప్పించి 'జడ్' సమ్మతి లేకుండ 'ఏ' అనునతడు తీసికొనను. దానిని 'జడ్'కు తిరిగి ఇచ్చి వేసినందుకు బహుమానముగ 'జడ్' నుండి డబ్బు రాబట్టు కొనువరకు దానిని తనవద్ద నే ఉంచుకొనవలెనను ఉద్దేశముతో 'ఏ' అట్లు చేసెను. ఇచట 'ఏ' నిజాయితీ లేకుండా తీసికొనినాడు. అందువలన 'ఏ' దొంగతనము చేసినవాడగును.

(ఎమ్) 'జడ్'కు స్నేహితుడగు 'ఏ' 'జడ్' లేనప్పుడు 'జడ్' యొక్క గ్రంధాలయములోనికి వెళ్లి పుస్త కమును, కేవలము చదువుకొను నిమిత్తమును, తిరిగి ఇచ్చివేయవలెనను ఉద్దేశముతోను 'జడ్' అభివ్యక్త సమ్మతి లేకుండ తీసికొని పోవును. ఇచట బహుశా 'జడ్' యొక్క పుస్తకమును ఉపయోగించుకొనుటకు 'ఏ' తనకు 'జడ్' యొక్క గర్భిత సమ్మతి కలదని తలచియుండవచ్చును. ఇదే 'ఏ' యొక్క భావము అయినచో 'ఏ' దొంగతనము చేయలేదు.

(ఎస్) 'జడ్' యొక్క భార్యను 'ఏ' అను నతడు ధర్మము చేయుమని అడుగుసు. ఆమె భర్త యైన 'జడ్'కు చెందినవని 'ఏ' కు తెలిసియున్నట్టి వగు డబ్బును, ఆహారమును బట్టలను ఆమె 'ఏ' కు ఇచ్చును. ఇచ్చట బహుశః బిక్షము పెట్టుటకు 'జడ్' యొక్క భార్యకు అనుమతి కలదని “ఏ' తలచియుండవచ్చును. ఇదే 'ఏ' యొక్క భావము అయినచో ఏ దొంగతనము చేయలేదు.

(ఓ) 'జడ్' యొక్క భార్యకు 'ఏ' అనునతడు విటుడు. ఆమె ఒకవిలువగల ఆస్తిని 'ఏ'కు ఇచ్చును. ఆ ఆస్తి 'జడ్'కు చెందినదనియు, దానిని ఇచ్చుటకు ఆమెకు 'జడ్' యెక్క అనుమతి లేదనియు తాను ఎరిగియుండి 'ఏ' ఆ ఆస్తిని నిజాయితీ లేకుండ తీసికొనిన చో, అతడు దొంగతనము చేసినవాడగును.

(పీ) 'జడ్' కు చెందిన ఆస్తి తన ఆస్తి యేనని 'ఏ' సద్భావముతో విశ్వసించుచు, ఆ ఆస్తిని 'బీ' స్వాధీనము నుండి తప్పించి 'ఏ' తీసికొనును. ఇచ్చట 'ఏ' నిజాయితి లేకుండ తీసికొనలేదు. అందువలన అతడు దొంగతనము చేయలేదు.

దొంగతనము చేసి నందుకు శిక్ష,

379. . దొంగతనము చేసిన వారెవరైనను మూడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకవు కారావాసముతో గాని, జుర్మానాతో గానీ ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.