పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నివాస గృహము మొదలగువాటిలో దొంగతనము.

380. ఏదేని భవనము, డేరా, లేక జలయానము మనుష్య నివాసముగా ఉపయోగింపబడుచుండగా, లేక ఆస్తి అభిరక్ష కొరకు ఉపయోగింపబడుచుండగా అట్టి ఏదేని భవనము, డేరా, లేక జలయానములో దొంగతనము చేయువారెవరైనను ఏడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో శిక్షింపబడుదురు; మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

యజమాని యొక్క స్వాధీనములోని ఆస్తిని గుమాస్తా, లేక సేవకుడు దొంగతనము చేయుట,

381. గుమాస్తాగా లేక సేవకుడుగా యుండియైనను, గుమాస్తా, లేక సేవకుని హోదాలో నియోగింపబడి యుండియైనను, తన యజమాని లేక నియోజకుని యొక్క స్వాధీనములో ఉన్న ఏదేని ఆస్తిని దొంగతనము చేయువారెవరైనను ఏడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో శిక్షింపబడుదురు; మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

దొంగతనము చేయుటకుగాను మరణము, ఘాత లేక అవరోధము కలిగించుటకై సన్నాహముచేసికొనమీదట దొంగతనము చేయుట.


382. దొంగతనము చేయుటకు గాను, లేక అట్టి దొంగతనము చేసిన పిదప తప్పించుకొని పోవుటకుగాను, లేక దొంగిలించిన ఆస్తిని తనవద్ద ఉంచుకొనుటకు గాను, ఏవ్యక్తి కైనను, మరణము, ఘాత, లేక అవరోధము కలిగించుటకై గాని, మరణమునకు, ఘాతకు లేక అవరోధమునకు గురియగుదునను భయమును అతనికి కలిగించుటకై గాని సన్నాహము చేసికొనియుండి, దొంగతనము చేయువా రెవరైనను, పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి కఠిన కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

ఉదాహరణములు

(ఏ) 'జడ్' స్వాధీనములో ఉన్న ఆస్తిని 'ఏ' దొంగతనము చేయును. ఈ దొంగతనము చేయుచున్నపుడు 'జడ్' ప్రతిఘటించే సందర్భములో 'జడ్' కు ఘాత కలిగించు నిమిత్తమై గుండ్ల తో నింపబడిన ఒక పిస్తోలును 'ఏ' తన దుస్తుల క్రింద ఉంచుకొనును. ఈ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధమును 'ఏ' చేసిన వాడగును.

(బీ) 'ఏ' 'జడ్' యొక్క జేబు కొట్టును. అంతకుముందుగా 'ఏ తనసహచరులను 'జడ్' చుట్టు నిలిపి ఉంచెను. జేబుకొట్టు చుండగా 'జడ్' గమనించి ప్రతిఘటించుచో లేక 'ఏ'ను పట్టుకొనుటకు అతను ప్రయత్నించు చో వారు 'జడ్'ను అవరోధించవలెనని 'ఏ' అట్లు చేసెను. ఈ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధమును 'ఏ' చేసిన వాడగును.


బలాద్గ్రహణమును గురించి

బలాద్రహణము.

383. ఉద్దేశపూర్వకముగా ఏ వ్యక్తి నైనను ఆ వ్యక్తికి గాని ఎవరేని ఇతరవ్యక్తి కి గాని ఏదేని హాని కలిగింతునని భయపెట్టి, అట్లు భయ పెట్టబడిన వ్యక్తిచే ఏదేని ఆస్తిని లేక విలువగల సెక్యూరిటీని, లేక విలువగల సెక్యూరిటీగా మార్చవీలైనదై సంతకము చేయబడిన లేక ముద్రవేయబడిన దేనినైనను నిజాయితీ లేకుండ ఏ వ్యక్తికైనను అందజేయించు నతడెవరైనను 'బలాద్గ్ర హణము' చేసినవాడగును.

ఉదాహరణములు

(ఏ) 'ఏ' అనునతడు తనకు డబ్బు ఈయనిచో 'జడ్' కు పరువునష్టము కలిగించే ఒక నిందా లేఖనమును ప్రచురించెదనని 'జడ్' ను బెదరించును. ఈ విధముగా 'జడ్' తనకు డబ్బునిచ్చునట్లు చేయును. 'ఏ' బలాద్గ్రహణము చేసినవాడగును.

(బి) 'జడ్' కొంతడబ్బును 'ఏ'కు చెల్లింతునని ఒక ప్రామిసరీనోటు వ్రాసి, సంతకము చేసి 'ఏ'కు అందజేసిననే తప్ప 'జడ్' యొక్క బిడ్డను అక్రమ పరిరోధములో ఉంతునని 'జడ్' ను 'ఏ' బెదరించును, 'జడ్' ప్రామిసరీనోటు పై సంతకము చేసి అందజేయును. 'ఏ' బలాద్గ్ర హణము చేసినవాడగును.

(సీ) 'జడ్' కొంత పంటను 'బీ' కి అందజేయుదుననియు, ఆట్లు చేయనిచో శాస్త్రి కి గురియగుదుననియు ఒక బాండును వ్రాసి సంతకము చేసి 'బీ' కి అందజేసిననే తప్ప, 'జడ్' యొక్క పొలమును దున్నించి వేయుటకు దుండగులను పంపుదునని, 'జడ్' ను 'ఏ' బెదరించి తద్వారా 'జడ్' బాండు పై సంతకము చేసి అందజేయునట్లు చేయును. బలాద్గ్రహణము చేసినవాడగును.

(డీ) దారుణమైన ఘాత కలిగింతునని 'జడ్' ను భయపెట్టి నిజాయితీ లేకుండ 'ఏ' అనునతడు ఒక ఖాళీ కాగితము పై 'జడ్' చే సంతకము చేయించి లేక అతని ముద్రను వేయించి ఆ కాగితము 'జడ్' తనకు అందజేయునట్లు 'జడ్' ను ప్రేరేపించును. 'జడ్' ఆ కాగితము పై సంతకము చేసి 'ఏ' కు అందజేయును. ఇచట అట్లు సంతకము చేయబడిన కాగితమును విలువగల 'సెక్యూరిటీగా మార్చవచ్చును. కావున 'ఏ' బలాద్గ్రహణము చేసినవాడగును.