పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

352

అంతానికి ఆరంభం


కొందరైతే అక్కడే నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇట్టి స్థితిలో ప్రభుత్వం దృష్టి ఫినిక్సు ఆశ్రమం మీద పడకుండా వుంటుందా? సమీపంలో వుంటున్న శ్వేత జాతీయులనేత్రాలు ఎరుపెక్కాయి. ఫినిక్సులో వుండటం ప్రమాదకరంగా మారినా, అక్కడి పిల్లలు సైతం ధైర్య స్థైర్యాలతో పనులు చేస్తూనే వున్నారు. ఇంతలో శ్రీ వెస్టును అరెస్టు చేశారు. నిజానికి శ్రీ వెస్టును అరెస్టు చేయడానికి కారణం ఏమీ లేదు. శ్రీ వెస్ట్, మగన్‌లాల్ గాంధీ యిరువురూ అరెస్టు కాకూడదనీ, అందుకు అనువైన పనులు ఏవీ చేయకూడదని ముందే నిర్ణయించాం. అందువల్ల శ్రీ వెస్ట్ అరెస్టు కావడానికి అనుకూలమైన పనులేమీ చేయలేదు. అయివా ప్రభుత్వం ఇవన్నీ ఎందుకు చూస్తుంది? అరెస్టు చేయడానికి కారణాలను వెతుకుతుందా? చేతిలో అధికారంవున్నది. దాన్ని ఎలా వినియోగించడమా అనే తపన దప్ప దానికింకేమీ లేదు. శ్రీ వెస్టును అరెస్టు చేశారని తెలియగానే శ్రీ గోఖలే భారతదేశాన్నుంచి, తెలివిగల చురుకైన వారిని కొందరిని దక్షిణాఫ్రికాకు పంపించే ఏర్పాటు చేశారు. లాహోరులో దక్షిణాఫ్రికా సత్యాగ్రహులకు సహాయం చేయాలని ఒక పెద్ద సభ జరిగింది. ఆ సభలో శ్రీ ఆండ్రూస్ తన దగ్గరగల ధనమంతా దక్షిణాఫ్రికా సత్యాగ్రహులకు సహాయం నిమిత్తం దానంగా యిచ్చివేశారు. అప్పటి నుంచి శ్రీ గోఖలే గారిదృష్టి వారిపై పడింది శ్రీ వెస్టును అరెస్టు చేశారని తెలియగానే శ్రీ గోఖలే శ్రీ ఆండ్రూస్ గారికి తంతి పంపి మీరు దక్షిణాఫ్రికా వెళతారా అని ప్రశ్నించారు. శ్రీ ఆండ్రూస్ వెళతానని సమాధానం పంపారు. శ్రీ అండ్రూస్‌తో బాటు వారి ముఖ్య స్నేహితుడు శ్రీ పియర్సన్ కూడా దక్షిణాఫ్రికాకు ఓడలో బయలు దేరారు. అయితే సత్యాగ్రహ సంగ్రామం చివరి అంచుకు వచ్చేసింది. వేలాది మంది నిర్దోషుల్ని జైళ్లలో పెట్టడం సాధ్యమా? దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి గలఅట్టి శక్తి తగ్గిపోయింది. భారత దేశ వైస్రాయి అందుకు అంగీకరించలేదు. జనరల్ స్మట్సు యిప్పుడు ఏం చేస్తాడోనని ప్రపంచమంతా ఎదురు చూడసాగింది. యితర ప్రభుత్వాలు చేయగల వనే దక్షిణాఫ్రికా కూడా చేసింది. భారతీయులకు బాగా, అన్యాయం జరిగిందనే సత్యం ప్రపంచానికి స్పష్టంగా, తెలిసిపోయింది.