పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/369

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

350

కఠిన పరీక్ష


రక్షించడం కోసమే చేయరాని అత్యాచారాలు అక్కడి ప్రభుత్వం చేసింది దుఃఖం ఎందుకు కలుగుతుంది అని అంటే సుఖం కోసమే అని చెప్పవలసి వస్తుంది. దక్షిణాఫ్రికాయందలి భారతీయుల కష్టగాధల సమాచారం ప్రపంచమందంతటా వ్యాప్తమైంది. ఒక యంత్రంలో వుండే చిన్న పరికరాలన్నింటికి ప్రత్యేక స్థానం వున్నట్లే, ఒక ఉద్యమం ప్రారంభించినప్పుడు అందలి ప్రతి క్రియకు స్థానం అంటూ ఒకటి వుంటుంది. తుప్పు పట్టడంవంటి వాటివల్ల యంత్రం పని చేయకుండా పోయినట్లే, కొన్ని వ్యవహారాల వల్ల ఉద్యమం కూడా కుంటుపడుతూ వుంటుంది. సామాన్యంగా ఈశ్వరేచ్చ ప్రకారమేమనం పని చేస్తూ వుంటాం. అయితే ఏది అనుకూలమో, ఏది ప్రతికూలమో ఫలితాన్ని తెలుసుకోలేము. కానీ సాధనాలను తెలుసుకొనే అధికారం మాత్రమే మనకి వున్నది. సాధనాలు పవిత్రంగా వుంటే, దాని పరిణామాల విషయమై మనం నిర్భయంగాను నిశ్చింతగాను వుండవచ్చు

ఈ సత్యాగ్రహ సమరంలో ఒక గొప్ప విశేషం నేను చూచాను సత్యాగ్రహుల కష్టాలు, దుఃఖాలు ఎక్కువై పోయినకొద్దీ, పోరాట సమాప్తి సమీపానికి రాసాగింది. అంతేగాక మరో విశేషం కూడా యీ సత్యాగ్రహ సంగ్రామంలో నేను చూచాను. దోషరహితమైన, అస్త్ర శస్త్రాలు లేని, పచిత్రమైన అహింసాత్మక సమరంలో కష్టం వచ్చినప్పుడు అవసరమైన సాధనాలు శ్రమ లేకుండా తమంతతామే సమకూడుతాయి. వారెవరో కూడా తెలియని స్వయం సేవకులు పెద్ద సంఖ్యలో తామంతటతాము వచ్చి యీ సంగ్రామ సమయంలో మాకు సహాయం చేశారు. సామాన్యంగా యిటువంటి సహాయకులు నిస్వార్థంతో పని చేయరు. అదృశ్యంగా వుండి తమ సేవల్ని అందజేస్తూ వుంటారు. వారి సేవల్ని ఎవ్వరూ గుర్తించరు. సేవలకుగాను వారికి ఎవ్వరి సర్టిఫికెట్టు అక్కర లేదు. అయితే అట్టివాళ్ళు చేసే సహాయ సహకారాలు భగవంతుడి చిట్టాలో తప్పక లిఖించబడతాయి. యీ విషయాన్ని చాలా మంది సేవకులు గమనించారు. .. .

దక్షిణాఫ్రికా యందలి భారతీయులు యీ అగ్ని పరీక్షలో నెగ్గారు. వాళ్ళు అగ్నిగుండంలోకి ప్రవేశించారు. అందు సంపూర్తిగా పరిశ్రద్దులై బయటికి