పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

303


వీలుకాలేదు. అయినా గోఖలేగారి దక్షిణాఫ్రికా యాత్ర మమ్మల్ని మరింత దృఢచిత్తులను చేసింది. మళ్ళీ మా సమరం తీవ్రరూపంలో ప్రారంభమైనపుడు, యీ యాత్రానుభవం దాని అవసరం మాకు బాగా అర్థమైంది. గోఖలేగారు దక్షిణాఫ్రికాకు వచ్చి వుండకపోతే మంత్రివర్గంతో సమావేశమై వుండకపోయివుంటే మూడు పౌండ్ల పన్ను రద్దు విషయం మేము మా సమర తీర్మానాల్లో చేర్చుకుని వుండకపోయేవాళ్ళం ఒకవేళ ఖూనీ చట్టం రద్దు అయివుంటే, సత్యాగ్రహ సమరం కూడా నిలిచిపోయివుండేది. అప్పుడు యీ మూడు పౌండ్ల పన్ను విషయమై మళ్ళీ కొత్తగా సత్యాగ్రహం మొదలెట్టవలసి వచ్చేది దాని ఫలితంగా మరింత ఎక్కువ దుఃఖాన్ని అనుభవించవలసి వచ్చేది. అంతేకాక ప్రజలు దానికోసం వెంటనే సంసిద్ధులవుతారా లేదా అన్న విషయం కూడా అనుమానమే. మూడు పౌండ్ల పన్ను రద్దు చేయించటం స్వతంత్ర భారతీయుల కర్తవ్యం. దాన్ని రద్దు చేయించటంకోసం అర్జీలు పెట్టటం, ప్రతినిధి బృందాలను పంపటం వంటి చట్టపరమైన ఉపాయాలన్నీ చేశాం. 1895 నుంచే యీ పన్ను చెల్లించటం జరుగుతున్నది. కానీ ఘోరాతి ఘోరమైన దుఃఖాన్ని కూడా చాలా రోజుల వరకూ సహించవలసి వచ్చినప్పుడు ప్రజలు దానికీ అలవాటు పడిపోయారు. తరువాత దాన్ని అడ్డుకోమని వారికి నచ్చ చెప్పటం కూడా కష్టమై పోతుంది. ఆ దుఃఖం యొక్క తీవ్రతను గురించి ప్రపంచానికి తెలియ బరచటం కూడా కష్టం మంత్రి వర్గం గోఖలేకు మాటయిచ్చి సత్యాగ్రహుల మార్గాన్ని సుగమం చేసింది. ఇప్పుడిక ప్రభుత్వం యీ మూడు పౌండ్ల పన్నును రద్దు చేయకపోతే ప్రభుత్వం యిలా మాట తప్పటమే సమరానికి ప్రబల కారణమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇదే జరిగింది. ప్రభుత్వం యీ పన్నును రద్దు చేయకపోవటమే కాక రద్దు చేయబోమని స్పష్టంగా ప్రకటించిందికూడా..

ఇలా గోఖలే యాత్ర వల్ల మూడు పౌండ్ల పన్ను రద్దును సత్యాగ్రహం ద్వారా సాధించుకోవటంలో మాకు సాయం లభించింది. తన యీ యాత్రవల్ల దక్షిణాఫ్రికా సమస్యలను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా, తెలిసిన వాడిగా గోఖలే గుర్తించబడ్డారు. వారి మాటలకు విలువ పెరిగింది. దక్షిణాఫ్రికాలోని