పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



భూమిక

ఉపవాసాలవల్ల తదితర కారణాల వల్ల దక్షిణాఫ్రికా సత్యాగ్రహచరిత్రను పూర్తిగా వ్రాయలేక పోయానని పారకులకు తెలుసు ఈ నవజీవన్ సంచిక నుంచి నేను తిరిగి ఆ చరిత్ర వ్రాస్తున్నాను విఘ్నాలేమీ లేకుండా పూర్తిగా వ్రాయగలనని విశ్వసిస్తున్నాను. ఇప్పుడు మన దేశంలో నాకు కలుగుతున్న అనుభవాలన్నీ చిన్న స్థాయిలోనైనా సరే దక్షిణాఫ్రికాలో నాకు కలిగాయి సత్యాగ్రహ ప్రారంభంలో యిదే ఉత్సాహం, యిదే మాదిరి ఐక్యత, యిదే పట్టుదల అక్కడ కూడా కనబడేవి కొంత ముందుకు సాగిన తరువాత మధ్యలో యిదే నిరాశ. యివే తగాదాలు, యివే ఈర్ష్యా ద్వేషాలు యివే అభిప్రాయభేదాలు ప్రారంభమయ్యాయి కొద్ది మంది సత్యాగ్రహుల కార్యశక్తి, దృఢ దీక్ష, అచంచలమైన పట్టుదల, ఓర్పు చివరి వరకూ కనబడుతాయి ఊహించినవి, ఊహించనివి వ్యవహారాలు అక్కడ కూడా సాగుతూ వుండేవి అయితే భారత స్వాతంత్ర్య సంగ్రామం యింకా చరమస్థితికి చేరలేదు అక్కడ జరిగినవన్నీ యిక్కడ కూడా జరుగునని భావిస్తున్నాను. దక్షిణాఫ్రికా సత్యాగ్రహచరిత్ర యొక్క చివరి భాగం చదవండి ఊహించని, కోరని సహాయాలు లభించాయి. భారతీయులకు ఎంత ఉత్సాహం కలిగిందో, వాళ్లు ముందుకు ఒక్కుమ్మడిగా ఎలా సాగారో, విజయం ఎలా పొందారో కూడా తెలుస్తుంది

దక్షిణాఫ్రికాలో జరిగిన విధంగానే, భారత దేశంలో కూడా జరుగుతుందని నా దృఢవిశ్వాసం సత్యం, అహింస, తపస్సుల మీద నాకు అచంచలమైన శ్రద్ధ వున్నది. సత్యాన్ని పాలించువాడి ఎదుట ప్రపంచమందలి సంపదలన్నీ వచ్చి నిలబడతాయనీ, అతడు పరమేశ్వరుని దర్శనం పొందగలడని నా పూర్తి విశ్వాసం అహింస ఎదుట వైరానికి తావు వుండదు యిది సత్యం దుఃఖాలు సహించునట్టి వారు ప్రపంచంలో దేనినైనా సాధించగలరనే గట్టి నమ్మకం నాకు వున్నది. ఎంతో మంది కార్యకర్తల్లో నేను యిట్టి శక్తి సామర్థ్యాలు చూస్తున్నాను వారి సాధన వృధాకాదనే నమ్మకం నాకు వున్నది

xii