పుట:తెలుగు వాక్యం.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంశ్లిష్ట వాక్యాలు

59

2. 722 : స్థితిబోధక క్రియలనుగాని, సంఘటనాత్మక క్రియలనుగాని నామ్నీకరించి వ్యాపారాద్యంతాలను సూచించే క్రియలతో వాడలేం.

*(161)

a. ఆమె అందంగా ఉండటం మొదలు పెట్టింది.
b. ఆమె పొట్టిగా ఉండటం పూర్తి చేసింది.
c. ఆమె నల్లగా ఉండటం పూర్తి అయింది.
d. వాడికి కాలు విరగటం ప్రారంభమయింది.
c. వాడు బావిలో పడటం పూర్తి అయింది.

చివరి రెండు సంఘటనబోధకాలు (events} కావటంవల్ల ఈ వాక్యాలు వ్యాకరణ విరుద్ధాలు.

భావార్థకాలు సంఘటనాత్మక నామాలుగా ప్రవర్తించినప్పుడు 'జరుగు' అనే క్రియతో వ్యాకరణ సమ్మతాలవుతై.

(162)

a. వాడికి కాలు విరగటం జరిగింది.
b. వాడు బావిలో పడటం జరిగింది.

‘జరుగు' అనే క్రియతో సంఘటన, వ్యాపారార్థక నామాలు కర్తృ పదాలుగా రాగలవు.

2.723 : భావార్థక నామాలు ప్రధాన వాక్యంలో వ్యాపారబోధక నామంగానే గాక జ్ఞానార్థక క్రియలతో అభ్యసనార్థక నామంగా రాగలదు.

(163)

a. నాకు వచన పద్యాలు రాయటం వచ్చు.
b. మా ఆవిడ మిషను కుట్టటం నేర్చుకుంటున్నది.

ఈ పై వాక్యాలలో మిషనుకుట్టటం వచనపద్యాలు రాయటం అనే నామాలను ఉపవాక్యాలుగా, అంటేవాక్యంనుంచి నిష్పన్నమైనట్టుగా భావించ నక్కర్లేదు. అభ్యసనార్హంగా భావించిన ఏ వ్యాపారాన్నైనా, క్రియ అయితే నామ్నీకరించి ఇక్కడ వాడవచ్చు. అయితే ప్రాణి నిర్వహించే వ్యాపారబోధక క్రియలయితేనే ఇట్లా నామ్నీకరించటం సాధ్యం. అందువల్ల వీటిని గుప్త నిర్మాణంలో ప్రాణివాచకకర్త ఉన్న వాక్యాలుగా భావిస్తే వ్యాకరణ ప్రక్రియ తేలిక అవుతుంది.