పుట:తెలుగు వాక్యం.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

58

తెలుగు వాక్యం


(158)

a. వాన కురవటం మొదలయింది.
b. వంట చెయ్యటం పూర్తి అయింది.
c. తెలుగులో కావ్యాలు రాయటం పదకొండో శతాబ్దంలో ప్రారంభ
మయింది.
d. వరి నాటటం పూర్తి అయింది.

పై వాక్యాలలో వానకురవటం లాంటివి కర్తృ నిరపేక్షకమైన వ్యాపారాలు. మిగతా వ్యాపారాలు కర్త్రపేక్షకాలు. అయినా ఇక్కడ కర్తృపదానికి ప్రాధాన్యం లేదు. క్రియానిష్పన్న నామాలేకాక. సిద్ధనామాలు కూడా వ్యాపార బోధకాలు ఉన్నై. పెండ్లి జరిగింది, పరిశోధన చేస్తున్నారు, ఎన్నికలు పూర్తి అయినై , నాటకం మధ్యలో ఆగిపోయింది, యుద్ధం భీకరంగా జరుగుతున్నది , వంటి వాక్యాల్లో నామాలు వ్యాపారార్థక నామాలు. ప్రధాన క్రియకు వ్యాపార నిర్వాహకకర్త అవసరమైతే ఆ కర్త భావార్థకనామంగా మారిన ఉపవాక్యంలో కర్తతో అభిన్నమై ఉండాలి.

(159)

a. సుజాత వంటచెయ్యటం పూర్తి చేసింది.
b. సుజాత అలంకరించుకోటం ప్రారంభించింది.

పై వాక్యాలలో వ్యక్తమయిన రెండు వ్యాపారాలకు కర్తృ పదం ఒకటే ఉండాలి. వీటి గుప్తనిర్మాణం సమబోధక, సమరూపకమైన నామాలను కర్తృ పదాలని ప్రతిపాదించి, అందులో ఒకదాన్ని సూత్రంచేత లోపింపచెయ్యాలి. ఎందు కంటే ఏకాశ్రయంగా భావించినా భిన్న నామాలుగాని, ఏకరూపాలుగా ఉన్న నామ ద్వయంగాని ఈ వాక్యాల్లో కర్తలుగా ఉండటానికి వీల్లేదు. నియమోల్లంఘన జరగటంవల్ల ఈ కింది వాక్యాలు వ్యాకరణ విరుద్ధాలు.

*(160)

a. సుజాత వంటచెయ్యటం సుమిత్ర పూర్తి చేసింది.
b. సుజాత అలంకరించుకోటం సుజాత మొదలు పెట్టింది.

ప్రాణి వాచక కర్తృపదాల్ని అపేక్షించే సకర్మక క్రియలు ప్రధాన వాక్యంలో ఉన్నప్పుడు వాటికి కర్మస్థానంలో వచ్చే ఉపవాక్యాల్లో క్రియలుకూడా అట్లాంటివే అయి ఉండాలనీ, వాక్యాలు ఏకకర్తృకాలయి ఉండాలని పై వాక్యాలను బట్టి తెలుస్తుంది.