పుట:తెలుగు వాక్యం.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సామాన్య వాక్యాలు

23

క్రియారహిత వాక్యాలలో కూడా ఇదే పద్ధతిలో ప్రయోగించవచ్చు. ఇక్కడలాగే అక్కడకూడా ఈ శబ్దాలు చేర్చినపుడు పదక్రమంలో మార్పు వికల్పమవుతుంది. వీటిల్లో కొన్ని సంయుక్త వాక్యాలలో అసమాపక క్రియలకు కూడా చేరతై. అప్పుడుకూడా సమాపక క్రియ నామ్నీకృత మవుతుంది. ఈ కింది ఉదాహరణలలో ఈ ప్రక్రియ చూపించబడుతుంది.

(48)

a. అతను మెట్లు దిగుతూనట కిందపడింది.
b. నువ్వు కాఫీ తాగి కదా బజారుకు వెళ్ళేది?
c. నువ్వు చేస్తానంటే గదా పనిచెప్పేది?
d. ప్రజల్ని మోసం చెయ్యటమేగదా ప్రభుత్వాలు చేస్తున్నది?

ఈ పై వాక్యాలలో అసమాపక క్రియలైన శత్రార్థక, క్వార్థక, చేదర్థక, భావార్థక క్రియలమీద అటాదులు ప్రయోగించబడినై. ఆ కారణంగా సమాపక క్రియలు నామ్నీకృతాలు అయినై.

1.28 : వాక్యంలో కర్తృపదానికి, క్రియకు ఉన్న సంబంధం క్రియ బోధించే వ్యాపారాన్ని బట్టి ఉంటుంది. ఆ సంబంధాల ననుసరించి నామపదాల్ని ప్రాణి, అప్రాణి వాచకాలుగా; మూర్త, అమూర్త బోధకాలుగా ; మనుష్య, మనుష్యేతర వాచకాలుగా, ఘన, ద్రవపదార్థ వాచకాలుగా విభజించాల్సి ఉంటుంది, ఇవి కాక వేరే విభాగాలు కూడా అవసరం కావచ్చు, ఉదాహరణకి వాక్యాలు చూస్తే అట్లాంటి విభాగాల ఆవశ్యకత తెలుస్తుంది.

(49)

a. కర్ర విరిగింది.
b. కాయితం చినిగింది.
c. అద్దం పగిలింది.
d. ఇల్లు కడిగారు.
e. గుడ్డలుతికారు.

పై వాక్యాలలో ఒక్కొక్క నామానికి, క్రియావ్యాపారానికి ఉన్న పరస్పర సంబంధం తెలుస్తుంది. ఈ సంబంధాలన్నీ సంపూర్ణంగా గ్రహించినపుడే సమగ్రమైన తెలుగు వ్యాకరణం సాధ్యమవుతుంది.