పుట:తెలుగు వాక్యం.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సామాన్య వాక్యాలు

15

అర్థం రెండో వాక్యంలో సూచించిన దానితో సమానం. అంటే రామారావు చదవటానికి సుబ్బారావు పక్కనే ఉండి ప్రేరేపిస్తున్నాడు అని అర్థం. బహుశా ఈ అర్థభేదం చదువు అనే క్రియలోనే ఉండవచ్చు. ఒక అర్థంలో చదువుకు ఒక కాల పరిమితి ఉన్న కోర్సు అని కావచ్చు. రెండో అర్థంలో 'ఒక పుస్తకం' అని అర్థం కావచ్చు. అట్లాగే ఇంకో రకమైన ఆర్థభేదం ఈ కింది వాక్యాలలో చూడవచ్చు.

(28)

a. మా స్నేహితుడు నన్ను కాలేజీదాకా నడిపించాడు.
b. మా స్నేహితుడు నా చేత కాలేజీ దాకా నడిపించాడు.

ఈ పై వాక్యాలలో మొదటి దానికి రెండర్థాలున్నాయి. ఒకటి స్నేహితుడు నేను నడవడానికి భౌతికంగా ఆసరాగా ఉన్నాడని, రెండు, నేను నడవడానికి అతడు ప్రేరకుడుగా ఉన్నాడని. రెండో వాక్యానికి ఈ రెండో అర్థమే ప్రసిద్ధం. పై వాక్యాలనుబట్టి వాక్యాలలో ప్రేరక సంబంధాలు క్రియావ్యాపారానికి నామ పదాలకి ఉన్న సంబంధాన్నిబట్టి నిర్ణయ మవుతయ్యని తెలుస్తుంది .

1.245 : తెలుగులో కర్మణి వాక్యాలకు వ్యవహారంలో ప్రయోగం తక్కువ. కర్మణి వాక్యాలలో కర్తరి వాక్యాలలోని కర్తృ, కర్మపదాలు వ్యత్యస్తమవుతై. అట్లా వ్యత్యస్తమైనపుడు కర్తకు చేత వర్ణకం వస్తుంది. కర్తరి వాక్యంలో కర్మపదానికి, కర్మణి వాక్యంలో ప్రాధాన్యం వస్తుంది. ఈ కింది వాక్యాలలో ఇది సూచించబడింది.

(29)

a. కెలీగారు తెలుగు వ్యాకరణం రాశారు.
b. తెలుగు వ్యాకరణం కెలీగారిచేత రాయబడింది.

రెండవ వాక్యంలో ప్రధానమైంది తెలుగు వ్యాకరణం. తెలుగులో కర్మణి వాక్యాలు రచనా భాషలోను, కొన్ని రకాల ఉపన్యాసాలలోను, ఉపన్యాసాలవంటి కొన్ని సంభాషణలలోను మాత్రమే కనిపిస్తున్నాయి, కర్త ప్రాధాన్యం తగ్గించటమే కర్మణి వాక్యాల ప్రయోజనం. వ్యవహారంలో కర్తృ పదాన్ని యథేచ్ఛగా లోపింప జేయటానికి అవకాశం ఉంది. కనుక తెలుగు వ్యవహారంలో కర్మణి వాక్యాలకంత ప్రాచుర్యం లేదు. అయితే తెలుగు క్రియలో కర్తను బోధించే ప్రత్యయం ఉంటుంది. అందువల్ల రచనా భాషలో ఈ అవసరం కొంత కన్పిస్తుంది.