పుట:తిర్యగ్విద్వన్మహాసభ మరియు మూషకాసురవిజయం.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూషకాసురవిజయము

రంగము - ఉల్లితోట.


[మూషక భట్టుగారు ప్రవేశించుచున్నారు]


మూషక భట్టురుగారు.

మూష--(అంతట కలయజూచి) ఓహో! యీతోట యెంతరమ్యముగావున్నది! గట్లపొడుగునా ముల్లంగిచెట్లు వయ్యబడివున్నవి. వుల్లిమళ్ళలో మధ్యమధ్యపెరుగుతోటకూర మొక్కలు కోమలంగా పెరిగి నవనవలాడుతూ వున్నవి. పేరుకుయీపొలం కాపువాడిదంటారేకాని సమీపంలో కాపురంవుండడంఛేత నిజానికి నాదేకాన వాడిదియెంతమాత్రమున్నుకాదు. యీబీరకాయలూ ముల్లంగిదుంపలూ మొదలోయిన వాటినన్నిటిని వాడికంటె నేనె యెక్కువగా అనుభవిస్తాను. కష్టంవాడిదీ ఫలంనాదీగనుక వాడునాకొసం కష్టపడేనవుకరు కాని యజమానుడుకాడు. నాకోసం మళ్ళీకూరలు మొదలయినవి వెయ్యడానికి వాడవతలిపొలం యేలాగు దున్నవుంచినాడో! ఈపొలం యెండిపోయేటప్పటికి మళ్ళీ ఆపొలం సిద్దం అవుతుంది. ఆ దుర్మార్గుడు మాత్రం నేను చేసేది దొంగపని అని తిడుతూ వుంటాడు. తిట్టుకుతిట్టుకుని నోరునొప్పియెత్తి వాడేనశిస్తాడు. నూరు తిట్లయినా బొక్కిడు కొర్రలుకావు. ఎక్కడనయినా తిట్లవల్ల చావడమూ దీవనలవల్ల బ్రతకడమూవుంటుందా? వాడు రాకమునుపే ఒక్కసారి నాలుగు మూలలాతిరిగి నాపొలం అంతా చూసుకుని వస్తాను. (అని నాలుగు అడుగులు నడిచి) యీవంకను యెవరో వస్తూవున్నారు. ఇక్కడ నిలుబడతాను.