పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 09-2 పాడి సం: 10-049

పల్లవి:

అతనినె దూరరమ్మ అలుగ కుండిన నాఁడు
యీతల నాతల నివి యితవుగా కుండెనా

చ. 1:

వున్నమచందురుఁడు దప్పులురేఁచ బగవాఁడ
ఇన్నిటా నా విభుఁడె గురింతె కాక
సన్నపు జల్లనిగాలి జాలి రేఁచఁ బగవాఁడ
మన్నమగఁడు సేసిన మతకము గాక

చ. 2:

కమ్మని పువ్వులు మేను కాడిఁపార సూడుగద్దా
చిమ్ముల నా రమణుని చేఁతలె కాక
దొమ్మిసేసి తుమ్మిదలు తొలియాడ వైరులా
నమ్మించి బాస దప్పిననాథుఁ డింతె కాక

చ. 3:

ముప్పిరి మరుఁడు కాక ముంచఁగ దోసమువాఁడ
యెప్పుడు నీచేతఁలు ప్రాణేశువె కాక
కప్పుచు నన్నును శ్రీవెంకటనాథుఁడు గూడె
అప్పట్టప్పటి చేఁతలు ఆతనివె కాక