పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 07-6 వరాళి సం: 10-041

పల్లవి:

నీగుణా లేల మానీని నేనె వేసరఁ గాక
యేగతిఁ జెప్పినను నీయిచ్చ మానేవా

చ. 1:

పోరి పోరి నేఁ జెప్పినను బుద్దు లెల్లా నీ వాపెఁ
జేరఁబోయి కానికగాఁ జెప్పకుండేవా
గోరసేసి నడుమను గోళ్లురాచి నీ వలపు
పేరడిగా జగడాలు పెంచకుండేవా

చ. 2:

అద్దలించి నేఁ బెట్టిన ఆన లెల్లా నీ వాపె
వొద్దఁ బోయి సూడిదెగా వొట్టకుండేవా
బద్దుల నేరుపు లెల్లా పచరించి నీ మోహము
పెద్ద సేసి కైలాటాలు పెట్టకుండేవా

చ. 3:

పాసి‌ పోకు మని నిన్ను బలిమి నేనేఁ గొన్న
బాస లాపెకుఁ గప్పము పట్టకుండేవా
గాసి చేసి నిన్ను శ్రీవెంకటనాథ కూడితిని
ఆసపడి నీ వాపె నంటకుండేవా.