పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0112-4 ముఖారి సంపుటం: 07-070

పల్లవి:
ఇద్దరికీ వచ్చె దూరులేఁటికే నీకు
తిద్దుకొంటే నీవంకనే జేరుఁగదవే

చ.1:
మాటలాడే విభునితో మారువలుకక వుంటే
ఆఁటదానికెంత గర్వమనరటవే
చీటికి మాటికి నీవు సిగ్గువడేదెఱఁగరు
నీటున నాతని మీఁద నిందలెంచరా

చ.2:
నవ్వు నవ్వే పతి తోడ నగుతా నీవుండకున్న
జవ్వనమదములు రచ్చఁ బడవటే
రవ్వగా నీవు ముద్లరాలవౌట యెఱఁగరు
నివ్వటిల్ల నాతనినే నిష్యూరి యనరా

చ.3:
కలసే శ్రీ వేంకటేశు కౌఁగిటఁ గూడకుండితే
కలికితనమునకు కందు గాదటే
చెలిమి సేసి యాతని సెలవిచ్చు టెఱఁగరు
నెలవై కళలాతని నిండుకొనవా