పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/389

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0166-11 కేదారగౌళ సంపుటం: 07-387

పల్లవి:
ఏమోయని యెంచకుమీ యిందరిలోన నీవు
కామించిన జాడసుమ్మీ కలికి యిన్నియును

చ.1:
కొమ్మ నీపయ్యదలోనికుచముల మారు సుమ్మీ
నిమ్మపండ్లెగరవేసీ నీరమణుఁడు
రమ్మని చేతులఁ జూపరాక సుమ్మీ సన్నగాను
తమ్మిపూవులను వేసీ దవ్వులనే తాను

చ.2:
నిద్దరపుమెరుఁగుల నీచెక్కులమారు సుమ్మీ
అద్దముల నీడచూచీనప్పటిఁ దాను
వుద్దండాన నిన్ను గోరఁసూదిన భావము సుమ్మీ
కొద్దిమీరి గేదంగిరెకులనె చిమ్మీని

చ.3:
మలసి నిన్నుఁ గూడిన మారు సుమ్మీ నీవంపిన
చెలికత్తెఁ గాఁగిలించె సిగ్గుదేరను
కలసెను నిన్ను శ్రీ వెంకటేశుఁడీడకు వచ్చి
అలయించలేక సుమ్మీ ఆయములంటీని