పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/388

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0165-6 మాళవిగౌళ సంపుటం: 07-386

పల్లవి:
ఆనతిమ్ము నాతోను అనుమానము గలితే
నేనిక్కడనుండఁగానో నేమముచూపేవు

చ.1:
ఆసపడి వచ్చివున్న అంగనఁ జేకొనకుంటే
దోసమనే మాట నీవు తొల్లి వినవా
వాసిగల బొమ్మచారివలెనే వూరకుండేవు
బాసిచ్చి వచ్చితివో యేపడఁతికైనాను

చ.2:
చుట్టుమై వచ్చినాపెకుఁ జోటియ్యకుండితేను
వట్టి నిష్టూరముగాదా వరవాతను
ముట్టుక తపముచేసే మునివలెనె వుండేవు
గుట్టుతోడనుండేనని గుణముగైకొంటివో

చ.3:
గరిమ మొక్క వచ్చిన కాంతఁ గౌఁగిలించకుంటే
యెరవెరనవై తోఁచదా యెవ్వరికైనా
దొరవై శ్రీ వేంకటేశ గురునివలెనుండేవు
సరినన్నేలితివి నాసమ్మతి గావలశో