పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/387

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0165-5 సామంతం సంపుటం: 07-385

పల్లవి:
పుట్టిన మాటలివి భూమిలోనను
దట్టుపు సిగ్గులతోడ తానేల నవ్వీనే

చ.1:
తుమ్మిదలు బెదరెను దొండపండు గంటివడె
కొమ్మలాల చూడరే యీకొత్తలు నేఁడు
యిమ్ముల నీసోద్యములిందరమునాడుకొంటే
తమ్మికంటి యిందుకుఁగా తానేల నవ్వీనే

చ.2:
జల్లన ముత్యాలు రాలె చందురుఁడుదయమాయ
యిల్లదివో వినరె వోయింతులాల
చల్లఁగా నేమిదిచూచి సంతోసించుకొంటేను
దల్లాళితనముతోడ తానేల నవ్వీనే

చ.3:
కలువలు చెంగలించె కన్నెజాజులు ననిచె
లలిమీరి వోభామలాల మెచ్చరే
అలమి శ్రీ వెంకటేశుఁడాడనున్నాఁడంటిమింతే
తలపోసీ తలపోసి తానేల నవ్వీనే