పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు:0101-2 రామక్రియ సంపుటం: 07-002

పల్లవి:
ఎఱఁగనా నీగుణాలు యింతక తొల్లి
విఱుగని నామనసే వెఱిఁజేసెఁ గాక

చ.1:
సేసపాల పెండివారు సేనలుండఁగాను
ఆసపడి నాతో నవ్వేవంతే కాదా
యీ సుద్దులకెకా నే నీయింటికి రాను వెఱతు
దోసకారి చెలికత్తె తోడితెచ్చెఁ గాని

చ.2:
తఱితో వరుసవారు దగ్గరి కాచుకుండఁగా
నఱిముఱిఁ జేయివట్టేవంతె కాదా
యెఱిఁగుండి మానక నేనిట్టె మాటాడఁదగునా
పఱచుగూఁటి చిలుక పలికించెఁ గాని

చ.3:
కప్పురపుఁబళ్ళవారు కాచుకిట్టే వుండఁగాను
అప్పుడే నన్నుఁ గూడితివంతె కాదా
నెప్పున శ్రీ వేంకటేశ నేనూ నీవూ నొక్కటే
యిప్పుడే వీరిడి మరుఁడింత సేసెఁ గాని