పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0151-1 శ్రీరాగం సంపుటం; 07-297

పల్లవి:
ఎంతని చెప్పదు నీలేమజవ్వన
మంతయు నెరుఁగు నంగజుఁడు

చ.1:
మిన్నెల్లా నిండెను మెరుఁగులే చెలి
కన్నుల మించులు గలుగఁగా
పున్నమవెన్నెల పోయెఁ జోటులేక
సన్నముగాఁ జొచ్చె చందురుఁడు

చ.2:
దిక్కుల నింతటఁ దిమిరము గప్పి
నిక్కి కొమ్మకొప్పు నెగడఁగా
చిక్కి రాతురుల చీఁకటి చెదరి
చుక్కల రాసులు చూపట్టెనే

చ.3:
ఇంతలో శ్రీ వేంకటేశు కౌఁగిటికి
నింతికుచగిరులెదుగఁగా
వంతలఁ గొండలు వానలఁ గరఁగి
యింతలింతలాయె నిన్నియును